MLC Botsa: ఇసుక పేరుతో దోపిడీ జరుగుతోంది.. ఎమ్మెల్సీ బొత్స సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ (Sand Policy) అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (MLC Botsa Satyanarayana) ఆరోపించారు.

Update: 2024-10-07 12:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ (Sand Policy) అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (MLC Botsa Satyanarayana) ఆరోపించారు. ఇవాళ ఆయన విశాఖపట్నం (Vishakhapatnam)లో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కోణంలో కాకుండా ప్రజల అవసరాల కోసం ఇసుక పాలసీ ఉండాలని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో టన్ను ఇసుకను రూ.475లకు విక్రయించామని గుర్తు చేశారు. గతంలో లారీ ఇసుక రూ.9 వేల నుంచి రూ.15 వేలకు సరఫరా అయ్యేదని పేర్కొన్నారు. నేడు అదే లారీ ఇసుకను కూటమి ప్రభుత్వం రూ.18 వేల చొప్పున విక్రయిస్తోందని ఆరోపించారు.

ఈ పరిణామంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇసుక పాలసీని కొనసాగించాలని పేర్కొన్నారు. ఉచిత పాలసీలో తగ్గాల్సిన ఇసుక ధర.. ఎలా పెరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పేరుతో ప్రత్యక్ష్యంగానే దోపిడీ జరగుతోందని.. సామాన్యుల తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని బొత్స ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం సరైన విధానాన్ని అమలు చేయడం లేదని ఆక్షేపించారు. దాదాపు 117 రోజుల నుంచి భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయింది. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక పాలసీ విధానాన్ని సరైన రీతిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.  


Similar News