ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే.. ఎమ్మెల్యే గంటా ఘాటు వ్యాఖ్యలు
తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ వెబ్ డెస్క్: తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 3 సంవత్సరాల క్రితం గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. కాగా ఆ రాజీనామాను అప్పట్లో ఆమోదించకుండ హోల్డ్ చేసిన స్పీకర్.. తాజాగా గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తూ రాజీనామా లేఖపైన స్టాంప్ వేశారు. ఈ నేపథ్యంలో తన రాజీనామాను ఆమోదించడం పై స్పందించిన గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఆత్మగౌరవం కోసమే మ్మెల్యే పదవికి రాజీనామా చేశానని పేర్కొన్న గంటాశ్రీనివాసరావు.. తాను రాజీనామా చేసినప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మద్దతుగా నిలిచి ఉంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యమైఉండేదని వెల్లడించారు.
కానీ అప్పుడు మాత్రం ఎవరు ముందుకు రాలేదని.. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను చేసిన రాజీనామాను మూడేళ్లు భద్రంగా కోల్డ్ స్టోర్లో దాచి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో తన రాజీనామాను ఆమోదించారు అంటే అది కచ్చితంగా రాజకీయ కుట్రే అని ధ్వజమెత్తారు. ఒక నేత ఇచ్చిన రాజీనామాను దొంగ చాటుగా ఆమోదించాల్సి అవసరం ఏముంది అని ప్రశించిన ఆయన.. విలువలను, సంప్రదాయాలను తుంగలో తొక్కి దొంగచాటుగా రాజీనామాను ఆమోదించారంటే దాని వెనుక కచ్చితంగా రాజకీయ కుట్ర కోణం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామా పై న్యాయ పోరాటం సాగిస్తామన్న గంటా శ్రీనివాసరావు.. తన రాజీనామా వైసీపీకి చెల్లు చీటీ అని మండిపడ్డారు. కాగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరిన నేపధ్యంలో గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించడం గమనార్హం.