అయ్యప్ప భక్తులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.. ఎమ్మెల్యే అనగాని
ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప భక్తులు మాలను ధరించారు.
దిశ వెబ్ డెస్క్: ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప భక్తులు మాలను ధరించారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప దీక్షను విరమించుకునేందుకు శబరిమలై వెళ్ళాలి అనుకునే భక్తుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంపై టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ స్పందించారు. ఈరోజు అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అధికార పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమల వెళ్ళాలి అనుకునే అయ్యప్ప భక్తుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయ్యప్ప దీక్షను విరమించుకునేందుకు శబరిమల వెళ్ళాలి అనుకునే భక్తుల కోసం అధికార ప్రభుత్వం గాని, దేవాదాయశాఖ మంత్రిగానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
ప్రస్తుతం లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని.. కానీ ఆ భక్తుల కోసం ప్రత్యేక బస్సులు కేటాయించలేదని.. ఈ నేపథ్యంలో శబరిమల వెళ్లే స్వాములు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదని తెలిపిన ఆయన.. టీడీపీ హయాం లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని రవాణా బస్సుల కేటాయింపుతో పాటు, సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కరించేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.