పార్టీ టికెట్లు అమ్ముకే వ్యక్తి టీడీపీ అధినేత..చంద్రబాబు పై రోజా ఫైర్

ఈరోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమానికి మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు.

Update: 2024-01-12 10:01 GMT

దిశ వెబ్ డెస్క్: ఈరోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమానికి మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి స్థిరత్వం లేదని ఆయన పొద్దున్నే జనసేన మధ్యాహ్నానికి కాంగ్రెస్ రాత్రికి బిజెపి తో ఉంటాడని ఎద్దేవ చేశారు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లుగా చంద్రబాబు నాయుడు వైఖరి ఉందని మంత్రి రోజా విమర్శించారు.

అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పార్టీ టికెట్లను అమ్ముకుంటాడని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పై మంత్రి రోజా విమర్శల జల్లు కురిపించారు. సర్వే అనంతరం వైసీపీ అభ్యర్థులను ప్రకటించిందని.. మరి సంక్రాంతి లోపే టిక్కెట్లను ప్రకటిస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదని ప్రశ్నించిన ఆమె.. అభ్యర్థులు లేకనే టిడిపి పొత్తుల రాజకీయాలు చేస్తుందని ఎద్దేవ చేశారు.

చంద్రబాబు నాయుడు రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని.. కానీ ఏ ఒక్కచోట కూడా చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం లేదని.. కుప్పంలో టిడిపికి డిపాజిట్ కూడా దక్కదని రోజా పేర్కొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఆయన తనయుడు లోకేష్ కి అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వాళ్ల గెలుపు పై నమ్మకం లేదని అందుకే రెండు స్థానాల నుండి పోటీ చేస్తున్నారని విమర్శించారు.

ఒక జనసేన తోనే కాదు దేశంలోని అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు వచ్చినా చివరికి గెలిచేది వైసిపి పార్టీ అని మళ్లీ సీఎం జగనే అవుతాడని రోజా ధీమా వ్యక్తం చేసింది. ఇక వెన్నుపోటు రాజకీయం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య అని 2014లో బిజెపితో కలిసి పోటీ చేయనన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం బిజెపితో ఎలా పొత్తు పెట్టుకున్నాడు అని ప్రశ్నించారు.

అసలు చంద్రబాబు నాయుడుకి సొంత జెండా ఎజెండా అనేది ఏదైనా ఉందా అని ప్రశ్నించిన ఆమె టిడిపి అధినేత నారా చంద్రబాబుపై సెటైర్ల జల్లు కురిపించారు. ఇక వైసీపీ లో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పుల విషయంలో టిడిపి విమర్శల జల్లు కురిపిస్తుందని.. అయితే అభ్యర్థులను మారుస్తాను అనే విషయాన్ని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పారని.. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తానని ముందే చెప్పారని ఆ కార్యక్రమంలో ఆమె గుర్తు చేశారు. 

Tags:    

Similar News