టికెట్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లమ్.. జగనన్న మాటే ఫైనల్: మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల ముందే ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి.

Update: 2023-12-26 11:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల ముందే ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ పార్టీ గతంలో గెలిచిన 151 సీట్లకు మించి.. ఈ సారి 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికలో అచితూచి వ్యహరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అలర్టైన జగన్.. ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌లను నిర్మొహమాటంగా పక్కన పెడుతున్నారు.

ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలితే మంత్రులను సైతం తప్పించడానికి జగన్ వెనకాడటం లేదు. దీని బట్టి జగన్ గెలుపు కోసం ఎంత పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్, వైసీపీ వర్గాల్లో మొత్తం జగన్ అభ్యర్థుల మార్పు నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల మార్పుపై వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తోన్న నగరి టికెట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్ని్కల్లో నగరి నియోజకవర్గ టికెట్‌ తనకు ఇవ్వకపోయినా మనస్ఫూర్తిగా అంగీకరిస్తానని రోజా తేల్చి చెప్పారు.

సీఎం జగనన్న మాట శిరసావహిస్తా స్పష్టం చేశారు. జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ అసంతృప్తిగా లేరని అన్నారు. కాగా, నగరి టికెట్ తనకు ఇవ్వకపోయిన ప్రాబ్లమ్ లేదంటూ రోజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ మారాయి. నగరి టికెట్ ఈ సారి రోజాకు ఇవ్వడం లేదన్న సంకేతాలు అందడంతోనే రోజా ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పుల్లో భాగంగా రోజాను నగరి నుండి తప్పించి ఆమెకు జగన్ ఎక్కడ అవకాశం కల్పిస్తారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


Similar News