విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో హాట్ టాపికైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో హాట్ టాపికైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహాలను చంద్రబాబు ఎంపీలకు వివరించారు. ఈ భేటీ అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటీకరణ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నామని తెలిపారు. విశాఖ రైల్వేజోన్‌పై పూర్తి స్పష్టత వచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక, జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ నాశమనైందని ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏం కావాలో సెంట్రల్ గవర్నమెంట్‌కు సీఎం చంద్రబాబు ఇప్పటికే వివరించారని చెప్పారు. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. గతంలో జగన్ కేంద్ర నిధుల్ని పక్క దారి పట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌లో టీడీపీ కీలకంగా మారడంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం పక్కకి పెట్టే యోచనలో ఉన్నట్లు టాక్. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.