వారితో మాట్లాడి ఆక్రమణలు తొలగిస్తాం.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడి భరోసా నింపారు.

Update: 2024-09-08 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడి భరోసా నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద బాధిత ప్రాంతాల్లో 5,6 ఫుడ్ ప్యాకెట్లు తీసుకుంటున్నారని.. అందుకే ఇబ్బందుల్లేకుండా అవసరానికి మించి ఆహారం సరఫరా చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఫుడ్ సప్లై పెంచాలని ఆదేశించారని గుర్తుచేశారు. బుడమేరు గట్లు పూర్తిగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. బుడమేరులో భారీగా అక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి.. ఆక్రమణల తొలగింపునకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని అన్నారు.

వరదలపై వైసీపీ అధినేత జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. వరదకు సంబంధించిన పూర్తి వివరాలను ముందు ఆయన తెలుసుకోవాలని మంత్రి నారాయణ హితవు పలికారు. ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా? అనేది తెలుసుకోవాలని అన్నారు. భారీ వరదలు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని చెప్పారు. ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఆహారం కచ్చితంగా అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. వరద తగ్గిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు.


Similar News