AP:‘పేద ప్రజల భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత’.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు
ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేద ప్రజల సంతోషం కోసం కూటమి ప్రభుత్వం(AP Government) కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) వెల్లడించారు.
దిశ,వెబ్‌డెస్క్: ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేద ప్రజల సంతోషం కోసం కూటమి ప్రభుత్వం(AP Government) కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) వెల్లడించారు. ఈ రోజు(మంగళవారం) నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి గ్రామంలో ఇంటింటికి వెళ్లి మంత్రి దుర్గేష్ వృద్ధులు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్వయంగా సామాజిక భద్రతా పెన్షన్ అందించారు. అంతేగాక ఒక్కొక్కరినీ ఆత్మీయంగా పలకరించి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్న భరోసానిచ్చారు. సకాలంలో పెన్షన్ పంపిణీ(Pension Distribution) చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ మంత్రి దుర్గేష్(Minister Durgesh) ఆవిష్కరించారు. ఈ క్రమంలో మంత్రి దుర్గేష్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు(Happy New Year) తెలిపారు. రాబోయే సంవత్సరంలో అందరి జీవితాల్లో సంతోషం నిండాలని, సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో క్రాంతి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆర్థిక భారాన్ని సైతం లెక్కచేయకుండా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ను రూ.3,000 నుంచి రూ.4,000కు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ ను రూ.3,000 నుంచి రూ.6,000కు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15,000 పెన్షన్ ఇస్తుందన్నారు. 1వ తేదీ ఆదివారం, సెలవు దినం అయితే అంతకు ముందు రోజే పెన్షన్ లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ప్రస్తుతం జనవరి 1వ తేదీన ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ముందు రోజే పంపిణీ చేయాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. ప్రజల ఆలోచనలు తెలిసిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. తెల్లవారుఝామునే తమకు పెన్షన్ అందించడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు పలువురు తనతో అన్నారని మంత్రి తెలిపారు.