AP Minister Chelluboina: అభివృద్ధిలో ఏపీ అగ్రగామి
వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు..
దిశ, అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఓ పక్క సంక్షేమాన్ని అందిస్తూ, మరో వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపేలా సీఎం జగన్ పటిష్ఠ ప్రణాళికలు అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్ధికంగా ముందుకు దూసుకువెళ్తుందని చెప్పారు. 2021-22లో రాష్ట్రం 11.43 శాతం జి.ఎస్.డి.పితో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉందని, దేశ జి.డి.పి 8.7 నమోదు అయిందని చెపపారు. రాష్ట్ర జి.ఎస్.డి.పి కేంద్రం జీడీపీ కన్నా 2.73 శాతం ఎక్కువన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా 38.5 శాతం ఎక్కువని తెలిపారు. అంతేకాదు దేశంలోనే రాష్ట్రం తలసరి ఆదాయంలో 6వ స్ధానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఇప్పుడు అర్థమవుతోంది..
రాష్ట్రం పురోగతిలో ఉందో, తిరోగతిలో ఉందో ప్రస్తుతం ఉన్న వృద్ధిరేటును చూస్తే అర్థమవుతుందని మంత్రి తెలిపారు. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకి తెలియడం లేదా అని ప్రశ్నించారు. డిపిఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ) నివేదిక ప్రకారం, 2022 జూలై చివరి నాటికి భారతదేశ వ్యాప్తంగా 1,71,285 కోట్ల పెట్టుబడులు రాగా అందులో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీపడి రూ.40,361 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున ఇండస్ట్రియల్ పాలసీతో సీఎం జగన్ ఏపీలో పెట్టుబడులు ఆకర్షించేలా పారిశ్రామిక రంగానికి కల్పిస్తున్న అవకాశాలు, వసతులతో ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి చెల్లుబోయిన పేర్కొన్నారు.