అమిత్ షా వచ్చినా.. అమితాబ్ బచ్చన్ వచ్చినా.. వైసీపీదే విజయం: మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ-జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితా హాట్ టాపిక్‌గా మారింది. ఈ లిస్ట్‌పై అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ-జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితా హాట్ టాపిక్‌గా మారింది. ఈ లిస్ట్‌పై అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాపై మంత్రి బొత్స సత్యనారాయణ రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన సీట్ల గురించి మాకు అనవసరమని తేల్చి చెప్పారు. వాళ్లకు అసలు అజెండా అంటూ ఏమీ లేదని.. టీడీపీ-జనసేనకు విధివిధానాలు అంటూ లేవని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల ప్రకటనతో ఆ రెండు పార్టీల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నదన్నారు. చంద్రబాబు, పవన్ ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి ఎవరెవరినో కలుస్తామంటున్నారని.. వాళ్లు ఎవరిని కలిసిన.. వాళ్ల తరుఫున అమిత్ షా వచ్చినా.. అమితాబ్ బచ్చన్ వచ్చిన ఏపీలో మరోసారి వైసీపీదే విజయమని జోస్యం చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో మాకు ఏ పార్టీతో పొత్తు లేదని.. వైసీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతోందని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై విషయంలో వైసీపీలో ఎలాంటి గందరగోళం లేదని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిందించి.. వైసీపీ మరోసారి ప్రభుత్వాని ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 118 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేశారు. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు కేటాయించారు.