AP:రైతులకు మేలు చేకూర్చే విధంగా కార్యక్రమాలు.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 10,212 నూతన బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు మరియు మత్స్యకార సహకార సంఘాలను 2023 నుంచి రిజిస్టరై నడపబడుతున్నందున ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించారు. సహకార శాఖ ద్వారా రైతులకు మరింత మేలు చేకూరే విధంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బుధవారం తాడేపల్లి పంచాయతీ రాజ్ కార్యాలయంలో జరిగిన ‘సహకారం-తో-సంవృద్ధి’ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పాడి పరిశ్రమ, మత్స్య సంపద వృద్ధికి సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 932 మహిళా డెయిరీ సహకార సంఘాలు ఉన్నాయని, వీటి ద్వారా రోజుకు ప్రస్తుతం 1,60,000 లీటర్ల పాలు సేకరించి డెయిరీ ఏజెన్సీలకు సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. తద్వారా 45,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమాభివృద్ధి, సహకార వ్యవస్థ ద్వారా కొత్తగా ఏర్పడిన సొసైటీలకు మద్దతుగా లాభదాయకమైన ధరను పొందడానికి పాల పరీక్ష యంత్రాలు మరియు శీతలీకరణ సౌకర్యాలు కల్పిస్తోందన్నారు.. పశుగ్రాసం పెంపకం దారులు మరియు పాడి రైతులకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్రంలో FPOలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సహకార సంఘాలకు నగదు ఉపసంహరణ పరిమితిని సంవత్సరానికి ₹1 కోటి నుంచి ₹3 కోట్లకు పెంచామన్నారు.
దేశవ్యాప్తంగా పాల సేకరణలో 4వ స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పాడి రైతులకు, పాల సంఘాలకు, మత్స్యకార సంఘాలకు ప్రశంసా పత్రాలు మంత్రి అచ్చెన్నాయుడు అందచేశారు. మత్స్య పరిశ్రమలో 2,400 ప్రాథమిక సహకార సంఘాలు 3 లక్షల మందికి చేదోడుగా నిలిచాయని, ఈ సంఘ సభ్యులకు బోట్లు, వలలు మరియు చేప పిల్లలు పంపిణీ చేస్తూ వారి ఆర్థిక వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సహకార సంఘాలకు మేలు చేకూర్చే చర్యలు చేపట్టిందని, సహకార సంఘాలకు ఆదాయ పన్ను ను 30% నుంచి 15%కు కుదించడం ద్వారా అధిక లాభాల బాటలో పయనించేందుకు మార్గం సుగమం అయిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్.ఎమ్.నాయక్, డైరెక్టర్ దామోదర నాయుడు, మత్స్య శాఖ కమిషనర్ డోలా శంకర్, ఆప్కాబ్ సీజీఎం వెంకటరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు.