ఏపీ హౌసింగ్ శాఖలో భారీగా అక్రమాలు.. సీఎం వద్దకు చేరిన రిపోర్టు

ఏపీ హౌసింగ్ శాఖలో భారీగా అక్రమాలు జరిగినట్లు సీఎం చంద్రబాబు వద్దకు ప్రాథమిక రిపోర్టు చేసింది. ...

Update: 2024-08-04 13:32 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ హౌసింగ్ శాఖలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈ రిపోర్టును సీఎం చంద్రబాబుకు అందజేశారు. త్వరలో హౌసింగ్ శాఖలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.  కాగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో అవకతవకలు జరిగాయని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాము అధికారంలోకి వస్తే హౌసింగ్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని అప్పట్లోనే హెచ్చరించారు. చెప్పినట్లుగానే జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది.

దీంతో హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు అధికారుల బృందాన్ని నియమించారు. దీంతో హౌసింగ్ శాఖలో భారీగా నిధులు దుర్వినియోగం అయినట్టు గుర్తించారు. ఆ లెక్కలను బయటకు తీశారు. గత ఐదేళ్లలో హౌసింగ్ శాఖకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో రూ. 3,183 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు వెల్లడించారు. నిర్మించిన, నిర్మించని ఇళ్లల్లో సైతం అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. నిర్మించిన ఇళ్లలో తప్పుడు లెక్కలు చూపించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. నిర్మించని ఇళ్లను లెక్కల్లో చూపినట్లు వెల్లడైంది.  ఈ మేరకు  రిపోర్టు తయారు చేసి సీఎం చంద్రబాబు వద్దకు పంపారు.  దీంతో  సీరియస్ యాక్షన్‌కు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News