AP News: కేబినెట్‌లో చోటెవరికి? వారికి అవకాశం దక్కుతుందా?

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సీఎం జగన్ తన తదుపరి కార్యాచరణ మొదలుపెట్టారు.

Update: 2022-03-31 02:14 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సీఎం జగన్ తన తదుపరి కార్యాచరణ మొదలుపెట్టారు. ఏప్రిల్ 8న గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం‌తో అది క్యాబినెట్ విస్తరణకు సంబందించిందే అంటూ కథనాలు మొదలయ్యాయి. ఒకవేళ అదే గనుక నిజమైతే ప్రస్తుత మంత్రుల్లో చాలా మందికి ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుంది. మంత్రులతో చేయించిన రాజీనామాలను గవర్నర్ వద్దకు తీసుకెళ్లి కొత్త మంత్రుల లిస్ట్‌ను ఆయనకు ఇచ్చే అవకాశం ఉందని సీఎం సన్నిహిత వర్గాలు అంటున్నాయి.ఈ నేపథ్యంలో కొత్త మంత్రులు ఎవరనేది వచ్చే నెల 8న లేదా 11న తేలిపోనుంది అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో 7న జరిగే క్యాబినెట్ సమావేశం తరువాత మంత్రులందరికీ సీఎం జగన్ స్వయంగా విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. కొత్త మంత్రులు ఎవరనేది కూడా అప్పుడే లెక్కలు మొదలు కాగా, ఆశావహులు మాత్రం తమకే బెర్త్ కన్ఫర్మ్ అంటూ సన్నిహితులతో చెప్పుకుంటున్నారు.

రాజకీయంగా, సీనియార్టి పరంగా..

ముందుగా ఉన్న మంత్రివర్గం మొత్తాన్నీ మార్చేస్తారంటూ ప్రచారం సాగినా.. ఉన్న వారిలో 90 శాతం మందిని మారుస్తున్నారని తెలుస్తోంది. రాజకీయంగా, సీనియార్టి పరంగా ఉన్నవారిలో కొందరికి మాత్రం మంత్రులుగా ఎక్స్టెన్షన్ దక్కనున్నట్టు సమాచారం. వారిలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌లకు మంత్రి పదవి కొనసాగింపు తథ్యం అంటున్నారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా ఆయనను కొనసాగించవచ్చనేది ప్రస్తుతానికి వైసీపీ నుంచి వినవస్తున్న ఊహాగానాలు.

జిల్లాల వారీగా పరిగణనలోనికి తీసుకుంటే..

శ్రీకాకుళం నుంచి ప్రస్తుత స్పీకర్, ఆముదాలవలస ఎమ్మెల్యే, తమ్మినేని సీతారాం‌కు మంత్రి పదవి ఖాయం అంటున్నారు. ఎమ్మెల్యే‌గా ఉన్న ధర్మాన ప్రసాద రావు‌కు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. విజయనగరం నుంచి ఎమ్మెల్యే వీరభద్ర స్వామి, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర పేర్లు వినబడుతున్నాయి. ఇక ఉత్తరాంధ్రకు కీలకమైన విశాఖ నుంచి ముగ్గురి పేర్లు మంత్రివర్గం రేసులో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ గెలుస్తుందని పేరు. అందుకే అన్ని రాజకీయ పార్టీలూ తూర్పుగోదావరి జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఈ జిల్లా నుంచి మంత్రి పదవులను ప్రకటించేందుకు సీఎంవో రెడీ అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి క్షత్రియ కోటాలో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు.. కాపు వర్గం నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సత్యానారాయణ, భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ పేర్లు బలంగా వినబడుతున్నాయి. కృష్ణా నుంచి పెనమలూరు ఎమ్మెల్యే బీసీ వర్గానికి చెందిన పార్థసారథికి మంత్రి పదవి దక్కడం అనేది లాంఛనమే అంటున్నారు.

రాజకీయంగా అత్యంత కీలకమైన గుంటూరు నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కుతుందో అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది. ప్రకాశం నుంచి గిద్దలూరు ఎమ్మెల్యే వెంకట రాంబాబు, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. నెల్లూరు నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నా వారి లిస్టు పెద్దదే అని భావిస్తున్నారు. అయితే మేకపాటి కుటుంబానికి సీఎం మంత్రి పదవి ఆఫర్ చేస్తారా? అన్న వాదనా బలంగా ఉంది. చిత్తూరు నుంచి ఈ సారి ప్రముఖంగా వినవస్తున్న పేర్లు నగరి ఎమ్మెల్యే రోజా, చంద్రగిరి భాస్కర్ రెడ్డి వీరిలో ఒకరికి మాత్రం మంత్రి పదవి ఖాయం అనే అంటున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప నుంచి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పలువురు పేర్లు లిస్ట్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. అనంతపురం నుంచి అర్బన్ ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నది. కర్నూల్ నుంచి నిన్నటి వరకూ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేరు వినిపించినా, ప్రస్తుతం సీఎం ఇదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్‌ను కొనసాగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పలు జిల్లాల నుంచి వివిధ వర్గాలకు చెందిన పలువురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తం మంత్రివర్గమే మారిపోయే చాన్స్..

సాధారణంగా క్యాబినెట్ పునర్వవస్థీకరణ జరిగినప్పుడు నలుగురైదుగురు మంత్రి పదవులు కోల్పోవడం కొత్త వారికి అవకాశం రావడం అనేది సహజమే. కానీ ఈ సారి ఏకంగా 90శాతం మంది మంత్రులు వీలయితే మొత్తం మంత్రివర్గమే మారిపోయే చాన్స్ ఉండడంతో ఏప్రిల్ 7న జరిగే క్యాబినెట్ చాలా ఎమోషనల్‌గా నడిచే అవకాశం ఉంది. అయితే సీఎం జగన్ ఇప్పటికే వారికి పార్టీ ఇన్‌చార్జిలు‌గా పదవులు ఇస్తామని చెప్పడం, కష్టించి పని చేసి పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తే మరలా మంత్రి పదవి రావొచ్చు అనే తాయిలం చూపి ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇన్నాళ్లు మంత్రి అనిపించుకున్న చోట అర్ధాంతరంగా ఆ హోదా కోల్పోవడాన్ని ఏ మేరకు ప్రస్తుత మంత్రులు జీర్ణించుకుంటారో చూడాలి.

Tags:    

Similar News