Nandyal District:మళ్లీ మొదలైన మద్యం వార్..!

నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నూతన మద్యం దుకాణాలు గురువారం తెరుచుకున్నాయి.

Update: 2024-10-18 05:14 GMT

దిశ, నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నూతన మద్యం దుకాణాలు గురువారం తెరుచుకున్నాయి. మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులు మద్యం ప్రియులకు బంపరాఫర్ ఇస్తున్నారు. ఎమ్మార్పీ రేటు కంటే తక్కువ ధరకు మందు అందిస్తున్నారు. దీంతో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. నందికొట్కూరు సర్కిల్ పరిధిలో ప్రభుత్వం 10 మద్యం దుకాణాలు కేటాయించింది. అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువ దుకాణాలు దక్కించుకున్నారు. అయితే వర్గపోరు వలన నెలకొన్న పోటీతో బైరెడ్డి వర్గీయులు మద్యం ధరలు తగ్గించి విక్రయాలు సాగిస్తున్నారు.

నందికొట్కూరు రూరల్ పరిధిలో ప్రభుత్వం రెండు మద్యం దుకాణాలు కేటాయించింది. ఇందులో ఒకటి టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి వర్గం, మరొకటి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గం లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. బైరెడ్డి వర్గం వారు కొణిదెల గ్రామంలో బుధవారం రాత్రి మద్యం దుకాణం తెరిచారు. మొదటి రోజు ఎమ్మార్పీ ధరలకే అమ్మకాలు జరిపారు. వారికి పోటీగా గురువారం మాండ్ర వర్గం కొణిదెలలోనే మద్యం దుకాణం తెరిచారు. దీంతో బైరెడ్డి వర్గం సీసా పై రూ.10 నుంచి రూ.20 వరకు రేటు తగ్గించి అమ్మకాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న మందు బాబులు కొణిదెలకు పోటెత్తారు. నందికొట్కూరులో మళ్ళీ మద్యం వార్ మొదలైందని ప్రజలు చర్చించుకుంటున్నారు.


Similar News