Dhone: ప్రైవేటు కాలేజీ నిర్వాకం.. మ్యాథ్స్ సరిగ్గా చేయలేదని చితకబాదిన లెక్చరర్

మ్యాథ్స్ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయలేని కారణంగా.. తరగతి గదిలో విద్యార్థులను లెక్చరర్ ఇష్టారీతిన చితకబాదాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-10-30 06:41 GMT

దిశ, వెబ్ డెస్క్: పిల్లల చదువుల కంటే వాళ్లు మోసే పుస్తకాల బరువే ఎక్కువ. కొన్నేళ్ల నుంచీ ఇదే జరుగుతోంది. కార్పొరేట్ చదువులంటేనే.. అమ్మో అని షాకయ్యే పరిస్థితి. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు చదువెలా చెబుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్టీ పట్టించి తెప్పించే మార్కులు ఆ క్షణం ఆనందానికే సరిపోతాయి. తర్వాత వాడు చదివిన వాటిలో అక్షరం ముక్క కూడా గుర్తుండదు. అసలు పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే.. ఎప్పుడు అడిగినా వారికి ఆ లెసన్ గుర్తొచ్చేలా ఉండాలి. అంతేగానీ.. అమ్మో ఆ సబ్జెక్టా.. వామ్మో ఆ లెక్చరరా.. అనేట్టు ఉండకూడదు కదా. ఇప్పుడున్న లెక్చరర్ల తీరు అలాగే ఉంది. ఇచ్చిన అసైన్మెంట్ చేయకపోయినా, సబ్జెక్ట్ రాకపోయినా ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన కడప జిల్లా డోన్ టౌన్ లో జరిగింది.

డోన్ పట్టణం (Dhone) లోని శ్రీ సుధాకాలేజీలో (Sri Sudha College) జరిగిన ఈ ఘటన మీడియా దృష్టికి చేరింది. కాలేజీలో ఉన్న సీసీటీవీల్లో రికార్డైన వీడియోను చూస్తే.. క్లాస్ రూమ్ లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయిన విద్యార్థులను లెక్చరర్ దేవేంద్ర విచక్షణా రహితంగా కొట్టాడు. ఇంటికెళ్లిన విద్యార్థులు ఈ ఘటనను తమ తల్లిదండ్రులకు చెప్పగా.. మర్నాడు వారు కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థులకు చదువు చెప్పే పద్ధతి ఇదేనా అని యాజమాన్యంపై మండిపడ్డారు. సదరు లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Similar News