ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌ను కలిసిన స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ నేతలు
రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు.
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలని కోరుతూ.. ఆదివారం ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ రన్ చేయాలని కోరుతూ అగనంపూడి నుంచి గాజువాక వరకు మానవహారం నిర్మించారు. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌ను స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని డిప్యూటీ సీఎం వినతి పత్రం అందజేశారు. అలాగే స్టీల్‌ప్లాంట్ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడితేవాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. కాగా రేపు ఢిల్లీలో స్టీల్, ఆర్థిక శాఖల కీలక సమావేశం ఉంది. ఇందులో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఒక రోజు ముందు కార్మిక సంఘాలు, స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ కావడంతో ఆసక్తి నెలకొంది.