ప్రతి మండలంలో ఓ భూ కుంభకోణం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ప్రభుత్వం మారడంతో భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రభుత్వం మారడంతో భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు యదేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో బాధితులు సీఎం చంద్రబాబును కలుస్తున్నారు. ప్రతి శనివారం ప్రజలను కలిసి వినతులను స్వీకరిస్తున్న ఆయన వద్దకు ఎక్కువగా భూ కుంభకోణాలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయి. ప్రతి మండలంలోనూ భూ కుంభకోణం జరిగినట్లు చంద్రబాబు దృష్టికి వచ్చాయి. దీంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన చంద్రబాబు కాసేపట్లో మీడియాలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం జరిగిందని, చర్యలు తీసుకోవాలని ప్రజలు తనకు వినతి పత్రాలు అందజేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా రీ సర్వే చేసిందని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రభుత్వం వల్ల దెబ్బ తిన్న వ్యవస్థలన్నింటిని గాడిలో పెడతామని, 100 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.