Srisailam: ఉగాది ఉత్సవాలకు సిద్ధం
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఆదివారం నుంచి ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి....
దిశ, శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఆదివారం నుంచి ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు కర్నాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే పాదయాత్రగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి చేరుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనానికి రూ. 200, అతిశీఘ్ర దర్శనానికి రూ.500ల చొప్పన వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అన్న ప్రసాద వితరణ
దేవస్థానం భక్తులకు అన్నదాన భవనంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించనుంది. అదేవిధంగా నాగలూటి, కైలాసద్వారం, క్షేత్ర పరిధిలో పలు చోట్లా కన్నడ భక్త బృందాలు, సేవా సంస్థలు అన్నదానం నిర్వహిస్తున్నాయి.
తాత్కాలిక వసతి
ఉగాది మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఆరుబయట ప్రదేశాల్లో పైప్ పెండాల్స్, షామియానాలు ఏర్పాటు చేయనున్నారు. క్షేత్ర పరిధిలోని శివదీక్షా శిబిరాలు, బాలగణేశ సదనం, మల్లమ్మ కన్నీరు, రుద్రాక్షవనం, ఆలయ మాఢవీధులు తదితర ప్రదేశాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.