Tension: ఈ గ్రామానికి 100 మీటర్ల దూరంలో రెండు పులులు.. ఏ క్షణమైనా దాడి!
నల్లమల అటవీ సమీప గ్రామమైన పెద్ద అనంతాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ...
దిశ, కర్నూలు ప్రతినిధి: నల్లమల అటవీ సమీప గ్రామమైన పెద్ద అనంతాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు ఒక పెద్దపులి మాత్రమే సంచరిస్తూ ఆవుల మందపై దాడి చేసి ఆవులను హతమారుస్తుందని భావించిన గ్రామస్తులపై మరో పిడుగు పడినట్లై్ంది. ఏకంగా రెండు పెద్ద పులులు గ్రామానికి వందమీటర్ల దూరంలోని సిద్ధాపురం చెరువు కుడి కాల్వలో తిష్ట వేశాయి. వారం రోజులుగా ఆయా గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అటవీ ప్రాంతాన్ని వదిలి జనారణ్యంలోకి ప్రవేశించడంతో ప్రజలు, రైతులు, ఉపాధి కూలీలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి పెద్దపులులు వచ్చి దాడి చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో సహాయక చర్యలు చేపట్టాల్సిన అటవీశాఖ మూడ్రోజులు కాపలా కాసి వదిలేసింది. అలాగే ఈ గ్రామానికి సమీపంలోని వెంకటాపురం, ముష్టపల్లె గ్రామాల్లో కూడా చిరుత పులులు సంచరించడం ప్రజలకు కలవరానికి గురి చేస్తోంది. వీటి నివారణ చర్యలు చేపట్టాల్సిన అటవీ శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
కర్నూలు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద చెరువైన సిద్ధాపురం చెరువు కుడి కాల్వలోనే పులులు తిష్టవేశాయి. పగలంతా మనుషులు కూడా కన్పించనంతగా గడ్డి, జమ్ము పెరిపోయిన కాల్వలో పులులు ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నాయి. పగలంతా బయటకు రాకుండా సాయంత్రం, రాత్రి వేళల్లో ఆహారం కోసం పశువులు, జీవాల కోసం బయటకు వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ సమయంలో ఎవరైనా ఒంటరిగా గానీ, గుంపులుగా గానీ బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పెద్ద అనంతాపురం గ్రామస్తులు ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకులు సాగిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పొలాల్లో సేద్యాలు, విత్తనాలు విత్తుకునే పనిలో నిమగ్నమయ్యారు. వీరు కూడా భయంతోనే సేద్యాలు చేస్తున్నారు. అటవీ అధికారులు మాత్రం పెద్ద పులుల సంచారాన్ని అరికట్టి ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి కేవలం మూడ్రోజులు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామస్తులు నిలదీస్తే తామేం చేయలేమని, పై అధికారులను కలవాలంటూ ఉచిత సలహా ఇవ్వడం పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు.
మళ్లీ దాడి చేసే అవకాశం
నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన లక్ష్మన్న అనే రైతుకు చెందిన రెండు ఆవులను పెద్ద పులి హతమార్చింది. ఈ విషయాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు కాల్వ ప్రాంతంలో పులుల కదలికలను గుర్తించేందుకు 4 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. మరుసటి రోజు పులి ఆవును తీసుకెళ్లేందుకు వచ్చింది. ఇలా పులి ఆవును తీసుకెళ్లే దృశ్యాలన్నీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు బయటకు చెప్పకుండా దాచారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో పెద్ద పులులు సంచరిస్తే అవి అడవిలోకి వెళ్లేంత వరకు పహారా కాస్తూ ప్రజలకు అండగా ఉండేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కన్పించడంలేదని వాపోతున్నారు. వీటికి తోడు అటవీ అధికారులు పశువులను అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లరాదని, ప్రజలు కూడా బయట తిరగొద్దని చెప్పడం చూస్తుంటే చేతులెత్తేసినట్లుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పులులు గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటే తమ భద్రతను గాలికొదిలేశారని, అధికారులు స్పందించి వాటి సంచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మహిళపై దాడికి యత్నం
గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళపై పెద్దపులి దాడికి యత్నించింది. పెద్దపులిని చూసిన ఆమె చాకచక్యంగా ఇంట్లోకి జారుకుని బతికి బయట పడింది. వెంటనే ఆమె తలుపులు వేసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకెళితే అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం దురదృష్టకరం. మనుషుల ప్రాణాలు పోతేగాని స్పందించరా ? అంటూ నిలదీస్తున్నారు. రెండు పెద్ద పులులు కాల్వలోనే తిష్టవేయడంతో భయాందోళన చెందుతున్నారు. చంపేసి రోజు ఆహారంగా తీసుకుంటున్న ఆవును కళేబరాన్ని గ్రామస్తులు కాల్చివేశారు. దీంతో ఏ క్షణమైనా ఆవుల మందపై గానీ, గొర్రెల మందపై గానీ పెద్ద పులులు దాడి చేసే అవకాశం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి పెద్ద పులుల సంచారాన్ని అరికట్టి ప్రజల్లో నెలకొన్న భయాందోళనను తొలగించాలని గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.