Kurnool: వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
దళిత ద్రోహి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు...
దిశ, కర్నూలు ప్రతినిధి/డోన్: దళిత ద్రోహి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తే..జగన్ వచ్చాక ఏకంగా 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారని, అందులో 27 దళితులకు చెందినవేనని ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం డి.రంగాపురం వద్ద డోన్ నియోజకవర్గంలోకి చేరుకుంది. లోకేష్‌కు ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత నాయకులు ఘన స్వాగతం పలికారు. నంద్యాల జిల్లాలో అడుగు పెట్టాగానే రెట్టింపు ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లు పూలవర్షం కురిపించారు. అంతకుముందు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రులు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు లోకేష్‌కు వీడ్కోలు పలికారు. డోన్ ఇంచార్జి సుబ్బారెడ్డి గజమాలతో స్వాగతం పలికారు. కర్నూలు జిల్లాలో ప్రవేశించిన యువనేత పాదయాత్రకు జనసంద్రమై తెలుగు తుమ్ముళ్లు తరలివచ్చారు. డి.రంగాపురం నుంచి నల్లమేకలపల్లి, జక్కసానికుంట వరకు మండు టెండను సైతం లెక్క చేయకుండా లోకేష్ పాదయాత్రను సాగించారు.
అనంతరం రెండు జిల్లాల నుంచి వచ్చిన దళితులు, వివిధ దళిత సంఘాల నాయకులతో ముఖాముఖి నిర్వహించారు. పలువురు దళిత మహిళలు, సంఘాల నాయకులు జగన్ ప్రభుత్వంలో తమకు ఆన్యాయాలు, దాడులు, భూ ఆక్రమణలపై ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ మరో ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, దళితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తే.. జగన్ వచ్చాక ఏకంగా 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారన్నారు. అందులో 27 దళితులకు చెందినవేనని గుర్తు చేశారు. ఈ సైకో సీఎం వచ్చాక దళితులపై దాడులు కూడా పెరిగాయాన్నారు. దళితులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
సామాజిక న్యాయానికి టీడీపీ పెద్దపీట
రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం టీడీపీ కట్టుబడి ఉందని, దళితుల్లో 62 ఉప కులాలకు న్యాయం చేస్తామని యువనేత భరోసా కల్పించారు. దళిత యువతి కుటుంబానికి న్యాయం చేయాలని పోరాటంలో భాగంగా తొలిసారి పోలీస్ స్టేషనుకు వెళ్లానన్నారు. గుంటూరులో రమ్య అనే దళిత యువతిని ఓ మృగాడు హత్య చేస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం చేశామని ఆయన గుర్తు చేశారు. అమరావతి దళిత రైతుల హక్కుల కోసం రెండోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లానన్నారు. వైసీపీ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబానికి టీడీపీ అండగా నిలిచి రూ.15 లక్షలు సాయం చేసి, తనఖాలో ఇంటిని విడిపించిన ఘనత టీడీపీదేనన్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని తెలిపారు.
దళితులకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇన్నోవా, జేసీబీలు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచితే జగన్ వచ్చాక, ఇలాంటి పథకాలు అటకెక్కించడమే కాక, దళితులను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోనికి రాగానే దళితులకు శ్మశనాల కోసం స్థలం కేటాయిస్తామని హామీచ్చారు. 2001లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేశారని..దాని ద్వారా మాదిగ ఉపకులాలకు 27 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేయించిన కేసు కారణంగా వర్గీకరణ ఆగిపోయిందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే సత్కారం చేసి పాలాభిషేకం చేశారన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశంపై చర్చిస్తున్నామని, త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎస్సీలకు అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అమలు చేస్తామని హామిచ్చారు.