ప్యాపిలి, డోన్ మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలి: TDP
టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ నాయకులు డోన్ నియోజకవర్గం కరవు ప్రాంతాల్లో పర్యటించారు. ..
దిశ, డోన్: టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ నాయకులు డోన్ నియోజకవర్గం కరవు ప్రాంతాల్లో పర్యటించారు. డోన్ టీడీపీ ఇంచార్జి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గార్లదిన్నె, జలదుర్గం, కొచ్చెరువు, ఎన్.రంగాపురం, వెంగళాపల్లె, ప్యాపిలి, కలచట్ల గ్రామాల్లో పంటలు, చెరువులను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్యాపిలి, డోన్ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్, ప్యాపిలి మండలాలపై ఎంత ప్రేమ ఉందో అర్థమౌతుందని ఎద్దేవా చేశారు. గతంలో 77 చెరువులకు నీరు నింపే కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రితో చేయించారని .. ఇప్పటివరకూ ఒక్క చుక్క నీరు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుగ్గన ప్రచారం కోసం, ప్రచార ఆర్భాటాల కోసమే తప్పా రైతులకు ఎటువంటి ఉపయోగం జరగలేదని చెప్పారు. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ప్రజలను మోసం చేసేందుకు డోన్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో బుగ్గన మీటింగ్ పెట్టారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన 70% పనులే తప్ప, ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వంపై వ్యవసాయ స్టీరింగ్ కమిటీ పెద్దలు ఒత్తిడి తెచ్చి ప్యాపిలి, డోన్ మండలాలను కరవు మండలాలుగా ప్రకటించేలా, 77 చెరువులకు నీరు నింపేలా కృషి చేయాలని ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి కోరారు.