Kurnool: అరక పట్టి..పొలం దున్ని ఆకట్టుకున్న లోకేశ్

టీడీపీ హయాంలోనే బీసీలకు పెద్దపీట వేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు....

Update: 2023-04-19 16:06 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి (దేవనకొండ): టీడీపీ హయాంలోనే బీసీలకు పెద్దపీట వేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఘనత ఎన్టీఆర్‌‌కు దక్కుతుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుకు దక్కిందని లోకేశ్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం 75వ రోజు ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తెలుగు యువత నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డిలతో కలిసి ఆస్పరి మండలం వలగొండ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దీంతో లోకేష్‌కు పల్లెపల్లెనా జనాలు నీరాజనాలు పలికారు. వలగొండ, పుష్పాలదొడ్డి, కైరుప్పుల, కారుమంచి మీదుగా బయలుదేరి ములగుందంలో రాత్రి బస చేశారు. పల్లెకు వెళ్లినా రైతులు, కూలీలు, మహిళలు, యువత ఉప్పొంగిన కెరటంలా రోడ్లపైకొచ్చి లోకేశ్‌ను కలిశారు. తమ భవిష్యత్ నాయకుడు మీరేనని, గాడి తప్పిన పల్లె ప్రగతికి పునాది వేయాలని, తాగు,

సాగునీరు ఇవ్వాలని, అదే క్రమంలో పరిశ్రమలు తెచ్చి తమ పిల్లలకు ఉపాధి చూపాలని, కరువు, వలసలు ఆపేలా చర్యలు చేపట్టాలని యువనేతకు విన్నవించారు. మండుతున్న ఎండల్లో కూడా ఎంతో ఓపికతో జనం సమస్యలు వింటూ..రానున్నది చంద్రన్న రాజ్యం..మీ బాధలు, కష్టాలు తీర్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు.

పసుపు జెండాను గెలిపించే బాధ్యత మీరు తీసుకో వాలంటూ నారా లోకేశ్ ముందుకు సాగారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో బీసీ సంఘాల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. వాళ్లు చెప్పిన వివిధ సమస్యలు విన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకొచ్చాక గ్రామాల్లో ప్రజలకు గుక్కెడు నీరందించే నాధుడే కరువయ్యాడని మండిపడ్డారు. టీడీపీ పాలనలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, వైసీపీ వచ్చాక వాటా నిధులను చెల్లించలేక ఆ పథకాన్ని అటకెక్కించిందని లోకేష్ దుయ్యబట్టారు. కేంద్రం నిధులను వినియోగించడంలో విఫలమైందని, టీడీపీ అధికారంలోకొచ్చాక ఇంటింటికీ తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీచ్చారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని తెలియజేశారు.

అంతకుముందు యువనేత నారా లోకేష్‌ను కారుమంచి గ్రామస్తులు కలిసి వారి సమస్యలను వివరించారు. తమ గ్రామంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉందని, డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్లపై పారుతోందని, చౌడమ్మ గుడి వద్దనున్న 200 కుటుంబాల్లో ఒక్క ఇంటికీ కుళాయి లేదని విన్నవించారు. గ్రామంలో సీసీ రోడ్లు లేవని, ఎంపీపీ పాఠశాలకు ప్రహరీ లేదని, హైస్కూల్ వద్ద రోడ్డు సదుపాయం లేదని, ప్రహరీ లేదన్నారు. నాయకులు, అధికారులకు సమస్యలను విన్నవించినా ఫలితం లేదని, టీడీపీ అధికారంలోకొచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

అరక పట్టి..పొలం దున్ని

ఆలూరు నియోజకవర్గం కారుమంచి శివారులో బోయ అర్జున్‌ అనే రైతు పొలం దున్నుతున్నాడు. ఆ సమయంలో పాదయాత్రగా అక్కడికి చేరుకున్న యువనేత లోకేశ్‌ నేరుగా పొలంలోకి వెళ్లాడు. రైతుతో కలిసి అరక (నాగలి) చేతపట్టి పొలం దున్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉందా? అని రైతును అడిగగా..రైతు తాము ముగ్గురం అన్నదమ్ములమని, ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నామని, తమకున్న 11 ఎకరాల్లో గతేడాది మూడెకరాల్లో ఉల్లి వేస్తే వరద వచ్చి కొట్టుకుపోయి రూ.30 లక్షల నష్టం మిగిలిందన్నారు. నాలుగెకరాల్లో మిరప వేస్తే నాసీరకం విత్తనాల వల్ల నట్టేట మునిగామంటూ ఏకరువు పెట్టాడు. నాలుగెకరాల్లో వేరుశనగ సాగు చేస్తే ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదని, ఖర్చులు, కూలీలు పోను రూ.2.40 లక్షల నష్టం వచ్చిందని వాపోయారు. ప్రభుత్వాలు ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని చాలించడం తప్ప మరో మార్గం లేదన్నారు. యువనేత లోకేష్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ అనాలోచిత విధానాల వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో రైతుల సగటు అప్పు రూ.70 వేలు ఉంటే..ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా రూ.2.5 లక్షలకు చేరిందని దుయ్యబట్టారు. ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని వివరించారు. జగన్ ప్రభుత్వం కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందన్నారు. తమ ప్రభుత్వం రాగానే అందరికీ మేలు చేకూరేలా పాలన సాగిస్తామని తెలియజేశారు.

Tags:    

Similar News