AP News:లబ్ధిదారులకు రెండు సెంట్ల స్థలం ఇవ్వాలి.. CPI డిమాండ్
గత ప్రభుత్వ హయాంలో పేద ,బడుగు, బలహీన, వర్గాల ప్రజల కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని సంకల్పంతో జగనన్న కాలనీలో ఒక సెంటు స్థలం ఇచ్చారు

దిశ,ప్రతినిధి ఆదోని: గత ప్రభుత్వ హయాంలో పేద ,బడుగు, బలహీన, వర్గాల ప్రజల కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని సంకల్పంతో జగనన్న కాలనీలో ఒక సెంటు స్థలం ఇచ్చారు. ఇల్లు నిర్మించుకోవడానికి కేవలం రూ.1,80,000లతో నాణ్యతలేని నివాస గృహాలు నిర్మిస్తున్నారని, నాణ్యతలేని నివాస గృహాలు లబ్ధిదారులకు అంటగడితే సహించేది లేదని సీపీఐ పట్టణ కార్యదర్శి ఎస్.సుదర్శన్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి సుదర్శన్, సహాయ కార్యదర్శి విజయ్ లక్ష్మి నారాయణ ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బసాపురం లింగప్ప గోర్కల్ రంజిత్ గౌడ్, రమేష్ సుధాకర్ అనిమేష్ తదితరులు జగనన్న కాలనీ పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ...జగనన్న కాలనీలో సీసీ రోడ్లు మురికి కాలువలు మంచినీటి వసతి మరియు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో పేద ప్రజలకు కేవలం ఒక సెంటు స్థలం ఇచ్చి ప్రజలను చిన్నచూపు చూసిందని విమర్శించారు. ఇల్లు నిర్మించుకోవడానికి రూ.1,80,000 ఏ మాత్రం సరిపోవని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క లబ్ధిదారునికి రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న కాలనీలో ఉన్న లబ్ధిదారులకు రెండు సెంట్లు స్థలం ఇవ్వడం లేదని షరతులు విధించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పట్టణంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.