Kunrool: ఎమ్మిగనూరుకు సీఎం జగన్ వరాల జల్లు

ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు కురిపించారు...

Update: 2023-10-19 17:07 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి/ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు కురిపించారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హైలెవల్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. అలాగే ఆలూరు తాలూకా దేవనకొండ మండలం ఏర్పాటుతో పాటు గోనెగండ్ల మండలం గంజెళ్ల ప్రాంతం మధ్యలో ఒక వంతెన ఏర్పాటు చేయాలని కోరారు. దీని వల్ల ఆలూరు, దేవనకొండ మండలం ప్రజలు ఎమ్మిగనూరు ప్రాంతానికి వెళ్లేందుకు 30 కిలోమీటర్లు తగ్గుతుందని, వాటిని మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందుకు స్పందించిన సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. హంద్రీనీవా నదిపై రూ.47 కోట్లతో గాజులదిన్నె ప్రాజెక్టు కనెక్టువిటీకి గోనెగండ్ల, ఆలూరు, పత్తికొండకు అనుసంధానం చేస్తూ నిధులు విడుదల చేస్తున్నట్టు బహిరంగ సభలో ప్రకటించారు. దేవుడి చల్లని దీవెనలు, ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు ఇవ్వాలని సీఎం జగన్ కోరుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కా చెల్లెమ్మలకు నాలుగో విడత సాయం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మందికి రూ.రూ.325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి పేద వాడికీ మంచి చేసే అవకాశం, పరిస్థితులు మరింతగా మీ బిడ్డకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం జగన్ ప్రసంగాన్ని ముగించారు. 

Tags:    

Similar News