APUWJ Demand: జర్నలిస్టులపై దాడి చేసిన వారిని శిక్షించాల్సిందే..

జర్నలిస్టులపై దాడి చేసిన వారిని శిక్షించాల్సిందేనని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేసింది.

Update: 2023-05-19 13:52 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి: జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య అని, సీబీఐ వార్త కవరేజ్‌కు వెళ్లన ఏబీఎన్, హెచ్ఎంటీవీ రిపోర్టర్స్, కెమెరా మెన్స్‌పై దాడి చేసిన వారిని, దాడికి ప్రోత్సహించిన ఎంపీ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు జి.కొండప్ప, కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.ఎన్.రాజు, కే.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఎదుట శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచారన్నారు. అయితే తన తల్లికి బాగాలేదని, విచారణకు హాజరు కాలేనని, లాయర్లకు చెప్పి పులివెందులకు బయలుదేరారన్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్తున్నారా..? లేక ఇక్కడే ఉంటున్నారా..? అని తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు ఆయనను వెంబడించారు. దీంతో మీడియా ప్రతినిధులు కూడా అధికారులను ఫాలో అయ్యారన్నారు. ఇది గమనించిన ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఏబీఎన్, హెచ్ఎంటీవీ వాహనాలను ఆపి వాటిని ధ్వంసం చేయడమే కాకుండా వీడియో జర్నలిస్టుల చేతిలో ఉన్న కెమెరాలు లాక్కొని ధ్వంసం చేయడం దారుణమన్నారు. అంతేకాకుండా కెమెరాల ధ్వంసాన్ని అడ్డుకోబోయిన రిపోర్టర్స్‌పై, వీడియో జర్నలిస్టులపై దాడి చేసి గాయపరచడం దుర్మార్గమన్నారు.

మాజీ మంత్రి హత్య విషయమై ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే రిపోర్టర్లు క్షణక్షణం ఈ కేసు దర్యాప్తును ఫాలో చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ ఇది జీర్ణించుకోలేక వారిపై దాడి చేయడం బాధాకరమన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని, ప్రోత్సహించిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై అత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు నిత్య కృత్యంగా మారాయని, ఇది చాలా బాధాకరమన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి అంజి, ఉపాధ్యక్షుడు దస్తగిరి, సహాయ కార్యదర్శులు శివరాజ్ కుమార్, అవినాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, మధు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News