AP Farmers Association: 5న కర్నూలులో మహాధర్నా

నకిలీ విత్తనాలు, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత రైతులకు పరిహారమిచ్చి ఆదుకోవాలని రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి అధ్యక్షులు పి.రామచంద్రయ్య, రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు మల్లికార్జున, తెలుగు రైతుసంఘం రాష్ట్ర నాయకులు కేశవ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..

Update: 2022-12-31 15:28 GMT

దిశ, కర్నూలు: నకిలీ విత్తనాలు, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత రైతులకు పరిహారమిచ్చి ఆదుకోవాలని రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి అధ్యక్షులు పి.రామచంద్రయ్య, రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు మల్లికార్జున, తెలుగు రైతుసంఘం రాష్ట్ర నాయకులు కేశవ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు కార్మిక, కర్షక భవనంలో ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ, జిల్లా సమితి కార్యదర్శి జనార్ధన్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

గతేడాది ఖరీఫ్‌లో వేసిన పత్తి పంట దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇతర పంటల కన్నా అత్యధికంగా పత్తి పంట రైతులు సాగు చేశారని, మూడు జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలు ఒక పత్తి పంటనే సాగు చేసినట్లు చెప్పారు. దీన్ని అదునుగా చూసుకున్న విత్తన కంపెనీలు బీటీ కాటన్ విత్తనాలలో విత్తనాలను అత్యధికంగా కలిపి ప్యాక్ చేసి రైతులకు అంటగట్టారని, ఫలితంగా పంటలు దిగుబడి రాక నష్టపోయారన్నారు. ఈ సమస్యలపై నెల రోజులుగా ఏ సంఘానికి ఆ సంఘం విడివిడిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదన్నారు. స్పందించకపోగా విత్తన కంపెనీలను వెనకేసుకురావడం సరికాదన్నారు. ఒక్కో రైతు ఒక ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల దాకా ఖర్చు చేసి నష్టపోయారని వాపోయారు.

కల్తీ విత్తనాలను అరికట్టాల్సిన వ్యవసాయ శాఖ నిద్రమత్తులో మునిగిందని, అవినీతిని రుచి మరిగిన ఈ శాఖ ఏ ఒక్క కంపెనీపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోందన్నారు. అందువల్ల రైతులకు న్యాయం చేకూరే వరకు పోరాటాలు సాగిస్తామన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 5న జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ ధర్నాకు మూడు జిల్లాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు తెలుగురైతు రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సీపీఐ

రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు తదితర నాయకులు హజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతుసంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. రాజశేఖర్, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రాజారాం రెడ్డి, కర్నూలు జిల్లా రైతుసంఘం అధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కార్యదర్శి పోతుల శేఖర్, తెలుగు రైతు నాయకులు యుగంధర్, అయ్యన్న, నారాయణరెడ్డి, హరిబాబు, ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News