IRR Case: సీఐడీ విచారణలో లోకేశ్‌పై ప్రశ్నల వర్షం... ప్రధానంగా ఈ ఐదు అంశాలపైనే ఆరా..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇన్నర్ రింగు రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పు కేసులో 14వ నిందితుడిగా ఉన్నారు...
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇన్నర్ రింగు రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పు కేసులో 14వ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయనను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి లోకేశ్‌ను ప్రశ్నిస్తున్నారు. లంచ్ తర్వాత సైతం విచారణ చేపట్టారు. ప్రధానంగా ఇన్నర్ రింగు రోడ్డు ఎలైన్ మెంట్‌ను మార్పు చేశారనేది సీఐడీ అభియోగం. కొందరి భూములకు రేట్లు వచ్చేలా అనుకూలంగా ఎలైన్‌మెంట్ మార్పు చేశారని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో లోకేశ్‌కు అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్ ఆధారంగా విచారిస్తున్నారు.
‘ఇన్నర్ రింగు రోడ్డు అలైన్‌మెంట్ మార్పు ముందే ఎలా తెలుసు?. మూడు సార్లు ఎలైన్‌మెంట్ మార్చారని.. అలా చేయడం వెనుక మీ పాత్ర ఉందా?. హెరిటేజ్‌కు లబ్ధిచేకూరేలా అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చారు?. హెరిటేజ్ సంస్థ అక్కడే ఎందుకు భూములు కొనుగోలు చేసింది?. అలైన్ మెంట్ మార్పు చంద్రబాబు నుంచే మీకు తెలుసా?.’ అని లోకేశ్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇస్తున్నారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు ఆయన్ను అధికారులు ప్రశ్నించనున్నారు.