Peethala Sujatha: ప్రమోషన్ల కోసం బరితెగిస్తారా.. మీరూ మహిళలేగా?

మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మహిళలపైనే అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు, నేరాలు, ఘోరాలు చేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

Update: 2023-04-10 15:24 GMT
Peethala Sujatha: ప్రమోషన్ల కోసం బరితెగిస్తారా.. మీరూ మహిళలేగా?
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మహిళలపైనే అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు, నేరాలు, ఘోరాలు చేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. నాడు పాదయాత్రలో జగన్.. తాను చిన్న పిల్లలకు మేనమామనన్నారు. ‘అక్క చెల్లెమ్మలకు తల నిమిరారు. కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఓట్లతో అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా చేశారు. మహిళలు పట్టపగలే తిరగలేని పరిస్థితిని తెచ్చారు. చట్ట ప్రకారం మహిళలకు ప్రత్యేక చట్టాలున్నాయి. ఆ చట్టాలను ఎక్కడా అమలు కానివ్వడంలేదు.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత కల్యాణి పట్ల మహిళా పోలీసులు సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించారని మండిపడ్డారు. గన్నవరంలో జరిగిన గొడవలకు సంఘీభావం తెలిపారన్న సాకు చూపి కల్యాణిని అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేయడం అమానుష చర్య అని మండిపడ్డారు.

‘కల్యాణి హత్యలు చేసిందా?, దోపీడీ చేసిందా? మహిళా టీడీపీ నాయకురాలు కల్యాణిని ఇంత దారుణంగా ఇంట్లో చొరబడి బట్టలు మార్చుకొని వస్తానన్నా సమయం ఇవ్వకుండా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. నైట్ డ్రెస్‌లో ఉన్న మహిళపై ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?. ఎంత సిగ్గుచేటు. ప్రభుత్వం వైసీపీది కాబట్టి పోలీసులు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. మహిళా కానిస్టేబుళ్లకు మానవత్వం లేదు. మహిళలను స్టేషన్‌కు లాక్కొని రావాలని ఎక్కడా లేదు. అధికార మదంతో సైకో పనులు చేస్తున్నారు.’ అని మండిపడ్డారు. మహిళా పోలీసులకు మినిమమ్ కామెన్ సెస్ లేదని ధ్వజమెత్తారు. హత్యలు, నేరాలు, ఘోరాలు చేస్తున్న వారిని వదిలేసి.. ఇంకా వారిని కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు కళ్లు మూసుకొని వారి ప్రమోషన్‌ల కోసం పై అధికారుల మెప్పు పొందడానికి పూనుకున్నారని ఆరోపించారు. ఇలాంటి పనులు చేయడంవల్ల వారు ప్రజల నుండి ఛీత్కారానికి గురవుతారు అని పీతల సుజాత హెచ్చరించారు.

జగనన్న వదిలిన బాణాన్ని పంపించేశారు

దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తన తండ్రిని చంపిన హంతకులకు శిక్ష వేయించి తనకు న్యాయం చేయాలని అడిగితే నెట్టేశారని మాజీమంత్రి పీతల సుజాత ఆరోపించారు. కేసు తారుమారు చేస్తారని ఆమె కేసును తెలంగాణ కోర్టుకు మార్చుకున్న పరిస్థితి రాష్ట్రంలో కల్పించారని ధ్వజమెత్తారు. జగనన్న వదిలిన బాణం అని చెప్పుకునే షర్మిలను పంపించేశారని ఎద్దేవా చేశారు. వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న జగన్ తల్లి విజయమ్మను గెంటేశారని విమర్శించారు. ‘ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కుటుంబ సభ్యుల్నే అవమానపరచిన వ్యక్తి ప్రజల్ని ఏం గౌరవిస్తారు. జగన్ భార్య ఒక్కటే మహిళ కాదు. అందరి భార్యలు మహిళలే అని జగన్ గ్రహించాలి. మహిళలకు న్యాయం చేయండి. తప్పు చేస్తే శిక్షించండి, అంతేగానీ వారి ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు. మహిళలపై జులుం ప్రదర్శించొద్దు’ అని మాజీమంత్రి పీతల సుజాత కోరారు. ఒకవేళ ఎవర్ని కించపర్చాలని చూస్తున్నారో వారే ఓటు అనే ఆయుధంతో మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకుల పనితీరు మారాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుల అణగదొక్కాలనే ఆలోచనలను విరమించుకోవాలని మాజీ మంత్రి పీతల సుజాత వైసీపీ నాయకులకు సూచించారు.

Read more:

చెప్పుతో కొట్టుకున్న వైసీపీ సర్పంచ్.. రీజన్ ఇదే..

Tags:    

Similar News