కేజీబీవీ విద్యార్థినులు క్షేమం

నర్సీపట్నం మండలం, వేములపూడి కేజీబీ హాస్టల్ లో అస్వస్థతకు గురైన విద్యార్థినిలు ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో మరో 48 గంటల పాటు ఉంచి, సెలవులకు పంపుతామని డీఎం అండ్ హెచ్వో రవికుమార్ పేర్కొన్నారు.

Update: 2025-01-09 12:28 GMT

దిశ ప్రతినిధి, అనకాపల్లి: నర్సీపట్నం మండలం, వేములపూడి కేజీబీ హాస్టల్ లో అస్వస్థతకు గురైన విద్యార్థినిలు ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో మరో 48 గంటల పాటు ఉంచి, సెలవులకు పంపుతామని డీఎం అండ్ హెచ్వో రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో అస్వస్థకు గురవుతున్న విద్యార్థినిలను వైద్య ఆరోగ్య, విద్యాధికారులు పరామర్శించి, అనంతరం హాస్టల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎం అండ్ హెచ్ వో రవికుమార్ మాట్లాడుతూ.. అస్వస్థకు గురైన విద్యార్థినిలు క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు 37 మంది విద్యార్థినిలకు వాంతులు, విరేచనాలు అయ్యాయన్నారు. వీరిలో ప్రస్తుతం నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు, వేములపూడి పీహెచ్సీలో ఐదుగురు, ప్రైవేటు ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారని వివరించారు.

ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రశాంతి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో జ్యోతి ఆధ్వర్యంలో వారిని నిత్యం పర్యవేక్షిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అదేవిధంగా మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, సెలవులకు పంపుతామన్నారు. అదేవిధంగా పరీక్షల నిమిత్తం విద్యార్థినిలు వినియోగించే ఆర్వో ప్లాంట్ నీటిని పరీక్షలకు పంపుతున్నట్టు ఆయన వివరించారు. విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అదేవిధంగా హాస్టల్ పరిసరాలు, భోజనశాల అన్నీ బాగానే ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ శాంతి మాట్లాడుతూ మంగళవారం రాత్రి మొదటగా ఇద్దరు పిల్లలు వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత మరికొంతమందికి వాంతులు రావడం తో వైద్యులతో పాటు సిబ్బంది అప్రమత్తమైనట్టు వివరించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. హాస్టల్ పరిశీలనలో మరికొంతమంది అధికారులు పాల్గొన్నారు.


Similar News