Kadapa Mayor Vs MLA : కడప మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే
కడప(Kadapa) మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మేయర్ సురేశ్ బాబు(Mayor Suresh Babu) కు, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి(MLA Madhavi Reddy)కి మధ్య ఆధిపత్య పోరుకు వేదికైంది.
దిశ, వెబ్ డెస్క్ : కడప(Kadapa) మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మేయర్ సురేశ్ బాబు(Mayor Suresh Babu) కు, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి(MLA Madhavi Reddy)కి మధ్య ఆధిపత్య పోరుకు వేదికైంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వేదికపై మేయర్ పక్కన ఎమ్మెల్యేను కూర్చోనివ్వకుండా కార్పోరేటర్లు కూర్చునే చోట కూర్చుకోవాలంటున్న పాలక వర్గ వైసీపీ నేతల తీరుపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి భగ్గుమన్నారు. కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలను తీసుకొని ఆమె మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేను మినహా మిగతా ఎవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. లోపలికి వెళ్లిన మాధవి రెడ్డి.. ఇన్నాళ్లుగా కుర్చీ వేసి ఇప్పుడు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. కార్పోరేటర్లలతో పాటు ఎమ్మెల్యే కూర్చోవాల్సిన అవసరం ఏముందని ఆమె నిలదీశారు. ఈ అంశంపై వాదోపవాదాలు జరిగాయి. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడుతూ మహిళను అవమానిస్తారా? వీళ్లందరి భరతం పడతాను.. ఈ అవినీతి తిమింగలాల్ని బయటకు లాగడం ఖాయమన్నారు. నేను కుర్చీల కోసం ప్రాకులాడే వ్యక్తిని కానన్నారు. ఎమ్మెల్యేకు కుర్చీ తీసేసినా ఘటనను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అహంకారం, అధికారంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. నాకు మున్సిపాల్టీలో కుర్చీ ముఖ్యం కాదని, ప్రజలు నాకు ఎమ్మెల్యే కుర్చీ ఇచ్చారన్నారు. మేయర్ అక్రమాలు బయటపడుతాయనే మమ్మల్నీ సమావేశానికి రాకుండా అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆమె ప్రసంగానికి వైసీపీ కార్పోరేటర్లు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాలు తోపులాటకు దిగాయి.
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మేయర్ సురేశ్ బాబు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ తరుణంలో జరుగుతున్న కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ పక్కన ఎమ్మెల్యేను కూర్చోనివ్వకూడదని పాలక వైసీపీ వర్గం భావించింది. ఈ అంశాన్ని ఇరు పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలర్లు ఏమైనా జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఎస్పీకి ముందే ఫిర్యాదు వెళ్లింది. దీంతో పోలీసులు ముందస్తుగా భారీగా బలగాలను మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి భారీ కాన్వాయ్‌తో వచ్చారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు కూడా రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. మాధవి రెడ్డి మేయర్ పై చేసిన అవినీతి ఆరోపణలను నిరసిస్తూ మేయర్ సహా వైసీపీ కార్పోరేటర్లు కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేశారు.