జర్నలిస్టు స్థలాలపై ‘మాఫియా’ కన్ను
కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలోని దిన్నెదేవరపాడు, కల్లూరు మండలంలోని లక్ష్మీపురం రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 590 ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి.
ఎర్రమట్టి మాఫియా పెట్రేగిపోతోంది. అధికార వైసీపీ నేతల అండదండలతో ఎక్కడ పడితే అక్కడ వాలిపోతూ మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జర్నలిస్టుల స్థలాల్లోనూ అక్రమార్కులు వాలిపోయారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టిని తవ్వి తరలించుకుపోతున్నారు. దృష్టి సారించాల్సిన మైనింగ్, పోలీసు, రెవెన్యూ తదితర శాఖధికారులు పట్టీపట్టనట్లు ఉండటంపై పలు ఆరోపణలు ఎక్కువయ్యాయి. జగన్నాధగట్టుపై మట్టి తవ్వకాలు నిలిపేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
దిశ, కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలోని దిన్నెదేవరపాడు, కల్లూరు మండలంలోని లక్ష్మీపురం రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 590 ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. అందులో జగన్నాథ గట్టు, త్రిఫుల్ ఐటీ కళాశాల, ప్రభుత్వ క్లస్టర్ యూనివర్శిటీని నిర్మించారు. జర్నలిస్టులకు కూడా ఆ భూముల్లో 2009లో అప్పటి ప్రభుత్వం ది కర్నూలు జర్నలిస్టు మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో సర్వే నెంబర్ 478లో 15 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అప్పటి మార్కెట్ ధర ఎకరా రూ.4.20 లక్షల చొప్పున రూ.65 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది. ఒక్కొక్కరికి 3.50 సెంట్ల చొప్పున 256 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అక్కడే త్రిఫుల్ ఐటీ కళాశాలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించింది.
ప్రస్తుతం ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సమీపంలో విమానాశ్రయం ఉండటం, త్రిఫుల్ ఐటీ కళాశాల, క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటయ్యాయి. అయితే కొండ ప్రాంతం కావడం, రహదారి, తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులు లేకపోవడంతో జర్నలిస్టులు ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఈ క్రమంలో ఎర్రమట్టి మాఫియా అధికార పార్టీ నేతల అండదండలతో 60 నుంచి 70 ప్లాట్ల వరకు తవ్వకాలు చేపట్టింది. దాదాపుగా 20 అడుగుల లోతు వరకు తవ్వేసి మట్టిని తీసుకెళ్లిపోయారు. సరిహద్దు రాళ్లను కూడా తీసేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టు నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డీఆర్ఓ, ఏఎస్పీకి వినతిపత్రాలు అందజేత
జర్నలిస్టు స్థలాలపై ‘మాఫియా’ కన్నుజగన్నాథ గట్టుపైన జర్నలిస్టు స్థలాల్లో ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కొండప్ప, కె.నాగరాజు, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఈఎన్.రాజు అధికారులను కోరారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. అనంతరం డీఆర్ఓ నాగేశ్వర రావు, ఏఎస్పీ ప్రసాద్ లకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.వీ.సుబ్బయ్య, జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాస్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు శ్రీకాంత్, శ్రీనాథ్ రెడ్డి, సురేష్, ఖలీల్, కోశాధికారి అంజి, జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, సహాయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.