మనోహర్ కోసం విశాఖ వస్తా... పోరాడతా: PawanKalyan
జనసేన నేత నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: జనసేన నేత నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మనోహర్‌తోపాటు, ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తానని, పోరాడతానని పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ను మూసి వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ని అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసు అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని, రోడ్డు మూసి వేయడం ఏంటని నిలదీశారు. ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోందని పవన్ చెప్పారు.
అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరును తాను ఖండిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. మనోహర్‌ని, ఇతర నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తానని, ప్రజల తరపున పోరాడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అరెస్టు అప్రజాస్వామికం - Sri @PawanKalyan* ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా?* శ్రీ మనోహర్ గారితోపాటు, ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తా... పోరాడతావిశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసి వేసి ప్రజలను తీవ్ర…— JanaSena Party (@JanaSenaParty) December 11, 2023