నెల్లూరులో జనసేన డల్.. అధినేత తీరుతో శ్రేణుల్లో ఆందోళన

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జనసేన పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

Update: 2023-04-25 01:57 GMT

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జనసేన పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ ఆవిర్భవించి 9 ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో ఆ పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం కాలేదు. గ్రామాల్లో కనీసం బలమైన క్యాడర్ కూడా లేని పరిస్థితి ఉంది. ఈ దశలో టీడీపీ- వైసీపీ లాంటి ప్రధాన పార్టీలకు దీటుగా పోటీకి నిలవలేకపోతున్నదనే చెప్పాలి. జిల్లాలో మూడో ప్రధాన పార్టీగా కూడా ప్రజలు గుర్తించడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో జనసేన పార్టీలో నేతల మధ్య సఖ్యత కరువైంది. కలిసి పనిచేయాల్సిన నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీని అభాసుపాలు చేస్తున్నారు.

దిశ, నెల్లూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో జిల్లా నేతలకు అంతుబట్టడం లేదు. నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతంపై అధినేత దృష్టి సారించక పోవడంతో నేతలు అయోమయంలో ఉన్నారు. పవన్ ఎప్పుడు ఏ పార్టీతో చేతులు కలుపుతారో ఆయనకే తెలియదని పార్టీ శ్రేణుల్లో విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే జనసేన గత ఎన్నికల్లో జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే కనీసం ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లను నిలుపుకోలేక పోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తులేకుండా ఒంటరిగా పోటీ చేస్తే జనసేన పార్టీ ఘోరంగా మళ్లీ నష్టపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే జనసేన గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీని కూడా గెలిపించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.

జిల్లా జనసేనపై జోరుగా విమర్శలు

పార్టీ ఆవిర్భవించి 9ఏళ్లు గడుస్తున్నా నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతం కాక పోవడంపై రాజకీయంగా విమర్శలు పెరిగాయి. ఏపీ రాజకీయ పార్టీల్లో వైసీపీతో తప్ప దాదాపు అన్ని పార్టీలను కవర్ చేశారని పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇక వైసీపీతో చేతులు కలిపితే రాజకీయ పార్టీగా జనసేన రికార్డు సృష్టించినట్లే అని జోకులు వేస్తున్నారు. పొత్తుల విషయంలో జనసేనకు ఇప్పటికీ క్లారిటీ లేదనే చెప్పాలి.

వైసీపీ మంత్రులు జనసేన పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతారో లేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వని జనసేన నేతలు మౌనం వహిస్తున్నారు. పవన్ ప్రతిసారీ తన బహిరంగ సభల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. దీన్ని గమనిస్తే పవన్ మరొకరితో పొత్తు కోసం ఎదురు చూస్తున్నారని అర్థమవుతుంది. బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నప్పటికీ అటు రాష్ట్రంలో కానీ ఇటు జిల్లాలో కాని బీజేపీ నేతలతో మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

జిల్లాలో తారస్థాయిలో వర్గపోరు

జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష్డుడు మనుక్రాంత్‌ రెడ్డిపై ఆపార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. అధ్యక్షుడిగా నియోజకవర్గ నేతలను సమన్వయ పరచడంలో మనుక్రాంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆపార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి తన ఓటమి తరువాత మూడున్నరేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలను చక్కదిద్దుకున్నారు.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ తానే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ చెప్పుకోవడంతో పార్టీలో కొందరి నేతలకు మింగుడుపడటం లేదు. కేతంరెడ్డి వినోద్ రెడ్డి గత ఎన్నికల్లో సిటీ నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓడి పోయారు. పార్టీ పదవులు ఏమీ లేక పోయినా సిటీలోని ప్రతిగడపగడపకు వెళుతూ ప్రజలకు చేరువయ్యారు. జిల్లా అద్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి మాత్రం ఆయనకు పార్టీతో సంబంధం లేదని చెప్తుండటం వారి మధ్య వర్గ విభేదాలు బయపటపడ్డాయి. ఇలా జిల్లాలో అందరి నేతలతో మనుక్రాంత్‌తో విభేదాలు ఉన్నాయి.

నియోజకవర్గాల్లో లేని ఇన్‌చార్జిలు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో సగం నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇన్‌చార్జులు లేని పరిస్థితి ఉంది. ఉన్న ఇన్‌చార్టులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ క్యాడర్ బలహీనంగా ఉంది. మండల స్థాయిలో అధ్యక్షుడు లేడు.. గ్రామాల్లో కనీసం బలమైన క్యాడర్ లేని పరిస్థితి ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా జిల్లాలో పూర్తి స్థాయిలో ఇన్‌చార్జిలను నియమించి పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించక పోవడంలో నేతలు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా జిల్లాలో పార్టీ బలోపేతంపై అధినేత దృష్టి సారించాలని నేతలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News