గందరగోళంలో పవన్.. రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కని జనసేనాని వ్యూహం..!

జనసేనాని పవన్​సభలంటే అభిమానులు స్వచ్ఛందంగా వస్తారు. వాహనాలు.. తాయిలాలు అవసరం లేదు. ఇది జనసేన పార్టీకి ఓ వరం.

Update: 2023-07-03 05:45 GMT

జనసేనాని పవన్​సభలంటే అభిమానులు స్వచ్ఛందంగా వస్తారు. వాహనాలు.. తాయిలాలు అవసరం లేదు. ఇది జనసేన పార్టీకి ఓ వరం. సభలకు హాజరైన కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వడంలోనే అస్పష్టత కన్పిస్తోంది. పార్టీ సిద్దాంతాలు ఏంటో ఇంతవరకు వెల్లడించలేదు. కనీసం భవిష్యత్​కార్యాచరణపై నిర్దేశించడం లేదు. వైసీపీని ఓడించండి. జనసేనను గెలిపించండి అని మాత్రమే చెబుతున్నారు. జనసేన అధికారానికి వస్తే ఏం చేస్తారో చెప్పే మేనిఫెస్టో విడుదల చేయలేదు.

రానున్న ఎన్నికలకు పొత్తులతో వెళ్తారా లేదా అనేది ఇంకా నిర్ణయించుకోలేదంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తారా.. బీజేపీతో కలిసి వెళ్తారా.. లేక టీడీపీతో కలుస్తారా అనేది స్పష్టత లేదు. ఓ రాజకీయ పార్టీ అధినేత ఇంత అస్పష్టంగా వ్యవహరించడం ఇంతవరకు చూడలేదంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. పవన్​అయోమయంలో పడ్డారా లేక జనాన్ని గందరగోళానికి గురిచేస్తున్నారా అనేది అర్థం కావడం లేదని విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్​వారాహి యాత్రకు జనం పోటెత్తారు. అది సినిమా నటుడిగా ఆయనకు ఉన్న క్రేజ్​కావొచ్చు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా అయ్యుండొచ్చు. తండోపతండాలుగా వచ్చిన ప్రజలకు జనసేన లక్ష్యం వైసీపీ విముక్త రాష్ట్రమని ఆయన చెప్పారు. జనసేన అధికారానికి వస్తే యువతకు రూ. 10 లక్షలు ఇచ్చి నియోజకవర్గానికి ఓ 500 మందిని వాణిజ్యవేత్తలుగా ఎదిగేట్లు ప్రోత్సహిస్తామన్నారు.

విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. గోదావరి జిల్లాల్లో మౌలిక సదుపాయాల కొరతను అధిగమిస్తామని హామీనిచ్చారు. ఇక వైసీపీ గూండాలను తరిమి తరిమి కొడతామంటూ హెచ్చరించడాలు, ఉద్వేగ ప్రసంగాలన్నీ షరా మామూలే.

అంతా గందరగోళమే..

ఇంతకీ పవన్ ప్రకటించిన కొన్ని అంశాలపైన అయినా లోతుగా అధ్యయనం చేసి ఎలా అమలు చేస్తారో చెప్పలేకపోయారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు సొంతంగా రూ. లక్ష చొప్పున 3 వేల కుటుంబాలకు సాయం అందించారు. కనీసం జనసేన ప్రభుత్వం వస్తే కౌల్దారీ చట్టాన్ని ఎలా రూపొందిస్తారు.. తద్వారా ఎలా వాళ్లను ఆదుకుంటామనేది స్పష్టతనివ్వలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును బీజేపీ పెద్దలతో మాట్లాడి వేగంగా పూర్తి చేస్తామన్న భరోసా ఇవ్వలేకపోయారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పలేకపోయారు.

పొత్తులపై పిల్లిమొగ్గలు..

ఇవన్నీ ఒక ఎత్తయితే రాజకీయంగా జనసేన పార్టీ వైఖరిపై కూడా స్పష్టతనివ్వలేదు. పొత్తులపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని మాత్రమే చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన తమతో పొత్తులో ఉన్నట్లు కమలనాథులు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వనని ఇప్పటిదాకా చెప్పారు. దీన్ని బట్టి టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అని చెప్పలేదు.

ఉట్టికెక్కలేనమ్మ..

సీఎంగా తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను పవన్ అభ్యర్థించారు. అంటే 175 స్థానాలకు జనసేన పోటీ చేస్తుందా అనే క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ బీజేపీతో కలిసి పోటీ చేయాలనుకున్నా సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించబోమని గతంలోనే వాళ్లు తెగేసి చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే సీఎం పదవి అవకాశం రాదు. ఇంతటి అస్పష్ట వైఖరి కలిగిన ఓ పార్టీ అధినేతను ఇంతవరకు చూడలేదని రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. ఈనెల 9 నుంచి మళ్లీ వారాహి యాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం అప్పుడైనా ఓ స్పష్టతనిస్తారో లేదో పైవాడికే తెలియాలి.

Read more : ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టబోతున్న పవర్ స్టార్.. తొలి పోస్ట్ దాని మీదనే?

Tags:    

Similar News