పులివెందుల వెళ్లాలన్నా జగన్ వణకుతున్నాడు: నారా లోకేశ్
వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అందుకే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌లు చేయిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం అయిన పులివెందుల వెళ్లాల్సి వచ్చినా సీఎం జగన్ భయంతో వణికిపోతున్నారని అన్నారు. పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత ఇన్ని చేసినా ఓట్లేసిన జనాన్ని చూడాలంటే జగన్ రెడ్డికి భయమని ఎద్దేవా చేశారు.సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద వైఎస్ జగన్ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రత్యర్థి, టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవిని చూసినా భయపడుతున్నాడరని అందువల్లే ఆయనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపునకు పోలీసుల్ని పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నాడని మండిపడ్డారు. రవి అక్రమ అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నామని...ఆయనకి ఏం జరిగినా జగన్, పోలీసులదే బాధ్యత అని నారా లోకేశ్ పేర్కొన్నారు. మరోవైపు ప్రొద్దుటూరు ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్‌పైనా లోకేశ్ స్పందించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ అన్యాయం, అక్రమమన్నారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలు పాల్జేస్తోందని ఇందుకు ప్రతీదానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని లోకేశ్ హెచ్చరించారు.