వైసీపీలో ప్రక్షాళనకు రంగం సిద్ధం.. సీఎం జగన్ ఫోకస్

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు గడుస్తున్నాయి. ఈ మూడేళ్లలో సీఎం జగన్ పార్టీపై ఫోకస్ పెట్టలేదన్నది బహిరంగ రహస్యం. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్‌

Update: 2022-03-08 05:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు గడుస్తున్నాయి. ఈ మూడేళ్లలో సీఎం జగన్ పార్టీపై ఫోకస్ పెట్టలేదన్నది బహిరంగ రహస్యం. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్‌ను కలవలేకపోతున్నారనే ప్రచారం ఉంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోకి కొందరికి మాత్రమే అనుమతి ఉందని కనీసం మంత్రులకూ ఎంట్రన్స్ లేదని ఇప్పటికీ ప్రచారం ఉంది. అలాగే ఆయా నియోజకవర్గాల్లోని నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పార్టీని రోడ్డుపైకి ఈడుస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీలకు పొసగకపోవడం, ఎమ్మెల్యే స్థానికనేతలకు సఖ్యత లేమి, మరికొన్ని చోట్ల ఆధిపత్య పోరు ఇలా అనేక సమస్యలు పార్టీలో నెలకొన్నాయి. ఇటీవల సీఎం జగన్ సర్వే సైతం చేయించారని అందులో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని తేలడంతో సీఎం జగన్ ఇక పార్టీపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. రాబోయే రెండేళ్లలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టి ఎన్నికల టీంను రెడీ చేసుకోవాలని యోచిస్తున్నారు. సీఎం జగన్ సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో త్వరలో ఎమ్మెల్యేలను కలుస్తానని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేశామని, ఎన్నికల ముందు చెప్పని వాగ్దానాలనూ నెరవేర్చామని మంత్రులకు వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని సూచించారు. రాబోయే రెండేళ్లు ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో ఉండాలని, త్వరలోనే వారితో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని వెల్లడించారు.

ఇక పార్టీపైనే..

మూడేళ్లు స్థానిక పార్టీ బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలకే వదిలేశారు. కొన్ని నియోజకవర్గాల్లో విభేదాలు రోడ్డెక్కాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఈ పరిణామాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని సీఎం గ్రహించారు. పలు సర్వేల్లో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా లేరని తేలింది. ఈ నేపథ్యంలో వారిని యాక్టివ్‌గా ఉండేలా చేయాలా లేకపోతే వేరే ఇన్‌చార్జులను నియమించి, పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. వారి మధ్య పొలిటికల్ గ్యాప్ లేకుండా 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేలా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే ఉండటంతో మొదట పార్టీని సెట్ రైట్ చేసే పనిలో పడ్డారు.

ప్రజల్లో ఉండాల్సిందే..

అసెంబ్లీ సమావేశాల అనంతరం లేదా సమావేశాల మధ్యలో సీఎం ఎమ్మెల్యేలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఎవరెవరితో ఏ అంశంపైనా చర్చించాలనే దానిపై ఓ జాబితా సైతం రెడీ అయినట్లు తెలుస్తున్నది. సీఎం కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్ కూడా వెళ్తాయని సమాచారం. 151 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, వారి పనితీరు వంటి వాటిపై అంతర్గత సర్వేలు చేయించారు. వివాదాలకు చెక్ పెట్టి ప్రజల్లో నిత్యం ఉండేలా ఎమ్మెల్యేలు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ప్రజల్లో నిత్యం కలిసి తిరుగుతున్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా వారిలా ప్రజల్లో ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు ఇప్పటికే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల అనంతరం ఎంపీలతోనూ సీఎం వన్ టు వన్ నిర్వహించబోతున్నారని తెలిసింది.

Tags:    

Similar News