లోన్ యాప్ బారినపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం విచారం: చంద్రబాబు నాయుడు
సకాలంలో జీతాలు రాక లోన్ యాప్‌లో అప్పులు తీసుకున్నాడు ఓ ఉద్యోగి..
దిశ, డైనమిక్ బ్యూరో: సకాలంలో జీతాలు రాక లోన్ యాప్‌లో అప్పులు తీసుకున్నాడు ఓ ఉద్యోగి. అయితే ఈఎంఐ లేట్ అయ్యేసరికి వారి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర విచారకరమన్నారు. ‘జీతం రాక ప్రభుత్వ ఉద్యోగి లోన్ యాప్ బారిన పడి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం విచారకరం. సకాలంలో జీతం రాక.. ఒక ప్రభుత్వ ఉద్యోగి లోన్ యాప్ బారిన పడి.. ఆత్మహత్యాయత్నం చేయడం అత్యంత విచారకరం. రాష్ట్ర దుస్థితికి దర్పణం. లక్షల కోట్ల అప్పులు, పన్నుల బాదుడు సొమ్ము అంతా ఎటు పోతుంది? ప్రభుత్వం సమాధానం చెప్పగలదా?’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.
ఇకపోతే ఒంగోలు వెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటూ స్థానిక బాలికల ఐటీఐ కాలేజీలో జూనియర్ అసిస్టెంటుగా నాగభూషణాచారి పని చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి జీతం అందకపోవడంతో ఇంటి అవసరాల నిమిత్తం లోన్ యాప్‌లో రూ. 50వేలు అప్పు తీసుకున్నాడు. అవి చెల్లించడం కోసం ఇంకో యాప్‌లో రుణం తీసుకున్నారు. ఇలా వరుసగా 23 యాప్‌లలో రుణం తీసుకుని చెల్లించాడు. అయినప్పటికీ వడ్డీ చెల్లించాలని యాప్ నిర్వాహకులు వేధించారు.
అంతేకాదు తన కుటుంబ సభ్యుల ఫొటోలను న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి బెదిరించడం ప్రారంభించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నాగభూషణాచారి మద్యంలో బాత్రూమ్ క్లీనర్ కలుపుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.