కబ్జా కోరల్లో శిఖం భూములు.. గ్రామీణ ప్రాంతాల శిఖం భూములంటే లెక్క లేదా?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో చెరువులు, కుంటలకు సంబంధించిన విలువైన శిఖం భూములు కబ్జాలకు గురవుతున్న అధికార యంత్రాంగానికి పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తోంది. కబ్జాదారులకు అధికారులే అండగా ఉండి కబ్జాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలకు ఉన్నతాధికారుల ఉదాసీనత బలం చేకూరుస్తున్నట్లుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Update: 2024-09-24 02:07 GMT

దిశ ప్రతినిధి,నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో చెరువులు, కుంటలకు సంబంధించిన విలువైన శిఖం భూములు కబ్జాలకు గురవుతున్న అధికార యంత్రాంగానికి పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తోంది. కబ్జాదారులకు అధికారులే అండగా ఉండి కబ్జాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలకు ఉన్నతాధికారుల ఉదాసీనత బలం చేకూరుస్తున్నట్లుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలకే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా జీవనాధారమైన గొలుసుకట్టు చెరువులు, కుంటలు ఎక్కడికక్కడ అక్రమార్కులు చెరబట్టాడు. కబ్జారాయుళ్లు కోట్లాది రూపాయల విలువైన వందల ఎకరాల శిఖం భూములను కబ్జా చేశారు. చెరువులు, కుంటల ఊపిరి తీసి వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. ఎక్కడికక్కడ కుంటలు, చెరువులకు సంబంధించిన భూములు, కాలువలు అన్యాక్రాంతం అవుతున్నాయి. రైతులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కారణంగా చెరువులను యధేచ్చగా కబ్జా చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి, ప్రజానికానికి తాగు, సాగునీరందిస్తున్న నిజాంసాగర్ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు 3,341 చెరువులు ఉన్నాయి. నిజామాబాద్‌లో 1174 కామారెడ్డిలో 2167 చెరువులు ఉన్నాయి. చెరువులతో పాటు వందల సంఖ్యలో కుంటలు, వాగులపై నిర్మించిన చెక్ డ్యామ్‌లు కూడా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 1174 చెరువులు, కుంటల్లో 959 చెరువులు కాగా, మిగతావన్నీ కుంటలు చెక్ డ్యాంలు. జిల్లా వ్యాప్తంగా 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు గల 112 చెరువులు, 100 కంటే తక్కువ ఆయకట్టున్న చెరువులు 407, ఆనకట్టలు 31, నాన్ కమాండ్ ఏరియా కింద 550, చెక్ డ్యాంలు 95, సర్కులేషన్ ట్యాంకులు 51 ఉన్నాయి. బోధన్ నియోజకవర్గంలో 197 చెరువులు, కుంటలు ఉండగా 21,087 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 386 చెరువులు, కుంటలు ఉండగా 35,341 ఎకరాల ఆయకట్టు, ఆర్మూర్ నియోజకవర్గంలో 220 చెరువులు, కుంటలు ఉండగా 16,802 ఎకరాల ఆయకట్టు, బాల్కొండ నియోజకవర్గంలో 371 చెరువులు, కుంటలు ఉండగా 29,472 ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నట్లు ఇరిగేషన్ రికార్డులు తెలుపుతున్నాయి.

2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015 లో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత, ఆధునికీకరణ పనులు చేపట్టింది. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కబ్జాల చెరలో పడి అన్యాక్రాంతమైన చెరువులను, శిఖం ఏరియా గుర్తించి ట్రెంచ్ కట్టింగ్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో సీఎం కేసీఆర్ సహా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా శిఖం భూములు కబ్జా చేసిన వారంతటి స్థాయిలో ఉన్న చర్యలు తీసుకుంటామని, శిఖం భూములను రికవరీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ, క్షేత్ర స్థాయిలో అమలుకు నోచుకోలేదు సరికదా టీఆర్ఎస్ నాయకులే అడ్డగోలుగా శిఖం భూములను కబ్జా చేసుకున్నారు. అధికారులు కూడా వారికి ఇతోధికంగా సాయం అందించారు. ఈ కారణంగా టీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వ హయాంలో అడ్డూ అదుపు లేకుండా శిఖం భూములు కబ్జాలకు గురయ్యాయి. శిఖం భూముల కబ్జాలపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేసిన ప్రతిసారి ప్రభుత్వ పెద్దలతో మాపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చేవని, చేసేది లేక చూస్తూ ఊరుకున్నట్లు అప్పట్లో జిల్లాలో అధికారులుగా పని చేసిన వారు చెప్పడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాలో 1,147 వరకు చెరువులు ఉండగా వీటి పరిధిలో లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఆక్రమణలతో చెరువుల విస్తీర్ణం తగ్గడంతో సాగు విస్తీర్ణం పై కూడా ఎఫెక్ట్ పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెపుతోంది. మరో వైపు నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి రాజకీయ నాయకులు చెరువులను కబ్జా చేస్తున్నారు.

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్‌లో 98 ఎకరాల విస్తీర్ణంతో రాజరాజేశ్వరి చెరువులో దాదాపు 8 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. నడిపల్లి పంచాయతీ పరిధిలో నేషనల్ హైవే 44 పక్కనే 35 ఎకరాల్లో ఏదుల్లా చెరువు కబ్జాకు గురైందని గ్రామస్థులు, రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోగా, ప్రజాప్రతినిధుల అండదండలతో కబ్జాకు గురైన భూమికి కన్వర్షన్లు సైతం పొందారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. జిల్లాలో మొత్తం 1,174 చెరువులో 15 శాతానికి పైగా సుమారు 170 చెరువులు కబ్జాలకు గురైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా నేషనల్ హైవే 44ను ఆనుకుని ఉన్న బాల్కొండ, ఆర్మూర్, జక్రాన్ పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి మండలాలతో పాటు నందిపేట్, ధర్పల్లి, ఎడపల్లి, బోధన్, నవీపేట్ మండలాల పరిధిలోని చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి నెలకొంది. వేగంగా అభివృద్ధి జరుగుతున్న నిజామాబాద్, ఆర్మూర్ , డిచ్పల్లి, బోధన్, నందిపేట్, భీమ్గల్, ధర్పల్లి, సిరికొండ తదితర ప్రాంతాల్లో ఆర్థిక బలంతో పాటు రాజకీయ అండ కలిగిన కొందరు పేరున్న రియల్టర్ల కన్ను పడటంతో చెరువులను కబ్జా చేసి రియల్ వెంచర్లుగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్, శాస్త్రినగర్ గ్రామాలను కలుపుకొని పెద్ద చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతోందని కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. సారంగపూర్, శాస్త్రినగర్ గ్రామాలను కలుపుకుని ఉన్న చెరువుల శిఖం భూములను కొందరు కబ్జా చేసి పేద, మధ్య తరగతి కుటుంబాలకు విక్రయించారని రైతులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలో బిచ్కుంద మండలంలో అర్కంపల్లి చెరువు కబ్జాల బారిన పడి పూర్తిగా కనుమరుగై పోతోందని స్థానికులంటున్నారు. ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి అన్యాక్రాంతమైనట్లు నిర్ధారించిన్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కబ్జారాయుళ్లపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శలున్నాయి. బీబీపేట పెద్దచెరువుకు వరద నీరు వచ్చే ఎడ్లకట్ట వాగును కొందరు బహిరంగంగా ఆక్రమించుకోవడంతో గత కొన్నేళ్లుగా చెరువు నిండడం లేదనే ఆరోపణలున్నాయి.

మద్నూర్ మండల కేంద్రంలోని కంచికుంటను సగం పూడ్చివేసి విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ఘన శెట్టి హనుమాన్ మందిర్ సమీపంలోని కుంటను కూడా సగం పూడ్చేశారు. బాన్సువాడ పట్టణంలో వారాంతపు సంత నిర్వహణ కోసం సమీపంలోని చెరువును సగం వరకు మొరం మట్టితో పూడ్చేశారు. బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు ఎన్ టీ ఎల్ పరిధికి చెందిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేశారని విమర్శలున్నాయి. భిక్కనూరు లోని పాపన్న కుంట చెరువు లో రియల్ వ్యాపారులు రాళ్లు, మొరం వేసి పూడ్చేందుకు ప్రయత్నాలు చేశారు. దాసన్న కుంట ఎన్ టీ ఏల్ లో రియల్ వ్యాపారులు దర్జాగా ప్లాట్లు చేసి విక్రయించారనే విమర్శలున్నాయి. అధికారులకు అంతా తెలిసే జరిగినా అడ్డదారిలో రియల్టర్లకు సహకరించాలరనే ఆరోపణలున్నాయి. రామేశ్వరపల్లిలోని బొబ్బిలిచెరువు ఎఫ్ టీఎల్ (పూర్తి చెరువు మట్టం) లోనే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల వర్షకాలంలో డబుల్ ఇళ్లు నీట మునిగే పరిస్థితి ఏర్పడుతోందని గ్రామస్థులంటున్నారు. గాంధారి మండల కేంద్రంలోని గుడి కుంట, మకరం చెరువులకు చెందిన భూములు, నాగిరెడ్డిపేట మండలం జప్తి జానకంపల్లి ఊర చెరువు శిఖం భూములు కబ్జాకు గురైనట్లు ఇటీవల రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిజాంసాగర్‌ కాలువలు పలు చోట్ల ఆక్రమించుకొని ఇతర నిర్మాణాలు వెలిసిన అంశం చర్చనీయాంశంగా మారింది. నాగిరెడ్డిపేట మండలంలోని జాప్తి జానకంపల్లి గ్రామ చెరువు కబ్జాకు గురైందని గ్రామస్థులు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సర్వే చేపట్టి భూములను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ గ్రామంలో గల సూరాయి చెరువు అన్యాక్రాంతం పై రెవెన్యూ శాఖకు గ్రామస్తుల ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

నిజామాబాద్ నగరంలో కూడా..

జిల్లా కేంద్రం నిజామాబాద్ నగర శివారులో కూడా కోట్లాది రూపాయల విలువైన శిఖం భూములు, ఇరిగేషన్ కాలువలు, వాగు భూములు కబ్జాలకు గురయ్యాయి. నగరం పరిధిలోని నాగారం శివారు బొందెం చెరువు, అర్సపల్లి శివారులోని రామ్మార్తి చెరువు సింహభాగం అన్యాక్రాంతానికి గురైందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. హైడ్రా తరహాలో రామ్మార్తి చెరువు పై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కబ్జా కోరల్లో నుంచి చెరువుని కాపాడాలని అర్సపల్లి విలేజ్ కమిటీ, రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామ్మార్తి చెరువు కబ్జాల తర్వాత ప్రస్తుతం 12 ఎకరాలు మాత్రమే మిగిలిందని స్థానికులంటున్నారు. బోధన్ రోడ్డును ఆనుకుని ఉన్న చెరువుకు కట్ట బఫర్ జోన్ స్థలంలో వెలసిన ఆక్రమణలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.

సమీపంలోనే 7 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న గాడికుంట చెరువు కూడా పూర్తిగా కబ్జాకు గురైన అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. రామ్మార్తి చెరువు పై కబ్జాపై జిల్లా కలెక్టర్ కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. భీమ్ గల్ పట్టణంలోని రాతం చెరువు శిఖం భూములు భవన నిర్మాణాలకు మున్సిపల్ కార్యాలయం అనుమతులివ్వడం, కబ్జాలపై ఉన్నతాధికారులు సైతం చర్యలు తీసుకోకపోవడం పై అనేక విమర్శలున్నాయి. కబ్జాలు యధేచ్ఛగా జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పై జిల్లా నుంచి శిఖం భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న కొందరు సీఎం రేవంత్ రెడ్డిని, రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసి ఫిర్యాదు చేసేందుకు ఆధారాలతో, పూర్తి వివరాలతో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


Similar News