కాసేపట్లో పోలవరానికి అంతర్జాతీయ నిపుణుల బృందం.. ప్రాజెక్టు భదత్రపై పరిశీలన

పోలవరం భారీ నీటి పారుదల ప్రాజెక్టును సందర్శించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం ఆదివారం పోలవరం రానుంది. ....

Update: 2024-06-30 02:14 GMT

దిశ, పోలవరం: పోలవరం భారీ నీటి పారుదల ప్రాజెక్టును సందర్శించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం ఆదివారం పోలవరం రానుంది. రాజమండ్రి నుండి ఈ బృందం రోడ్‌ మార్గంలో పోలవరం ప్రాజెక్టుకు ఆదివారం ఉదయం 9.45 గంటలకు చేరుకుంటుంది. ఈ బృందంలో అమెరికా ప్రొఫెషనల్‌ ఇంజనీర్‌ డేవిడ్‌ బి.పాల్‌, కెనడాకు చెందిన రిచర్డ్‌ డొన్నెల్లీ, సీన్‌ హించ్‌బెర్జర్‌ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు భద్రత, తదితర అంశాలపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రస్తుత ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బృందం ప్రాజక్టు భద్రతపై పరిశీలన చేసి తమ ఫైండింగ్స్‌ ప్రభుత్వానికి ఇస్తాయని భావిస్తున్నారు.

డయాఫ్రమ్ వాల్‌పై నివేదిస్తుందా?

బృందం భద్రత వరకే పరిమితమవుతుందా లేక ప్రాజక్టు నిర్మాణాంశం, దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ పరిస్థితిపై కూడా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందా అనేది వేచి చూడాలి. ఈ బృందం రాజమండ్రి నుండి బయలుదేరి ఉదయం 9.45కు పోలవరం ప్రాజక్టుకు చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు అధికారులను కలిసి ప్రాజక్టుపై వివరాలు తెలుసుకుంటారు. అనంతరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను తనిఖీ చేస్తారు. ఈ సందర్భంగా అధికారులు రివర్‌ బెడ్‌, జెట్‌గ్రౌటింగ్‌ పనుల డాక్యుమెంట్లను సైట్‌ వద్ద పరిశీలిస్తారు. అలాగే వివిధ ప్రాజక్టు డాక్యుమెంట్లను వారు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 నుండి 1.30 వరకు దిగువ కాఫర్‌డ్యామ్‌ తనిఖీ చేస్తారు. ఇక్కడ కూడా కాఫర్‌డ్యామ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి సైట్‌ వద్ద పనులు ఏ విధంగా జరిగాయో తెలుసుకుంటారు.

మూడు రోజుల పాటు చర్చలు..

అనంతరం మధ్యాహ్నం గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రాజక్ట్‌ వద్ద ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ గ్యాప్‌ 1ని తనిఖీ చేస్తారు. డ్యామ్‌ప్లాన్‌ను, జియాలజీ సెన్‌, తదితర డాక్యుమెంట్లను పనులు జరిగిన తీరును పరిశీలిస్తారు.. తిరిగి సాయంత్రం రాజమండ్రి వెళ్తారు. తిరిగి జులై ఒకటో తేదీ నుండి మూడు రోజులపాటు ప్రాజక్టు తనిఖీతో పాటు పోలవరం ప్రాజక్ట్‌ అథారిటీ అధికారులతో చర్చిస్తారు. అలాగే కేంద్ర జలవనరుల సంఘం అధికారులు, సెంట్రల్‌ సాయిల్‌, మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ అధికారులతో చర్చిస్తారు. అలాగే ప్రాజక్టు కంట్రాక్టింగ్‌ ఏజెన్సీ అధికారులతో చర్చలు జరుపుతారు. 


Similar News