తిరుమలలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే బలప్రదర్శన...93 మందితో శ్రీవారి దర్శనానికి

తిరుమల శ్రీవారి ఆలయంలో వైసీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించారు.

Update: 2023-10-30 10:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారి ఆలయంలో వైసీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించారు. సోమవారం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని ఎంపీ, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగేలా మందిమార్భంలంతో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గోర్లే కిరణ్ కుమార్, విజయనగరం ఎంపీ బెల్లానా చంద్రశేఖర్‌లు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. తమతో పాటుగా ఏకంగా 93 మందికి వీఐపీ బ్రేక్ దర్శనానికి తీసుకెళ్లారు. తమ నియోజకవర్గానికి చెందిన 93 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలంటూ టీటీడీ జేఈవో కార్యాలయంలోని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి బ్రేక్ దర్శన టికెట్లు పొందినట్లు తెలుస్తోంది. ఇందులో 20 ప్రోటోకాల్ దర్శనాలు పొందగా.. మిగిలిన 73 మందికి సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలను పొందారు. వీరంతా దర్శనం చేసుకునే సరికి సమయం పట్టడంతో సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఇలా వీఐపీ దర్శన టికెట్లు కేటాయించటంపై సామాన్య భక్తులు మండిపడ్డారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని వీఐపీ దర్శనాలను పరిమిత సంఖ్యలోనే కల్పించాలని టీటీడీని భక్తులు అధికారులను కోరుతున్నారు. 

Tags:    

Similar News