నా కార్యచరణ త్వరలోనే ప్రకటిస్తా : శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు

తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి దర్శించుకున్నారు.

Update: 2023-12-01 05:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తాను’ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2003లో అలిపిరిలో తనపై జరిగిన దాడి నుంచి ఆ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి కాపాడి ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇటీవల తనకు కష్టం వచ్చిన సమయంలో శ్రీవారికి మొక్కుకున్నానని...ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించినట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెంకటేశ్వరస్వామి తన కష్టాలు తీర్చారని ఈ నేపథ్యంలో మెుక్కులు చెల్లించుకునేందుకు ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇకపోతే త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉండాలని కోరుకున్నట్లు చంద్రబాబు మీడియాకు తెలిపారు. ఇకపోతే ఏపీ స్కిల్ డవలప్‌ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనారోగ్యం పాలవ్వడంతో ఈ ఏడాది అక్టోబర్ 31న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయస్థానం ఈ ఏడాది నవంబర్ 20వ తేదీన చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మధ్యంతర బెయిల్‌పై విధించిన షరతులు తొలగిపోవడంతో చంద్రబాబు నాయుడు ఇక దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News