HYD : జోష్ నింపిన కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్.. పరేడ్ గ్రౌండ్స్‌లో ఎగిరిన పతంగులు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్‌లో మహానగర వాసుల్లో మరింత సంక్రాంతి జోష్‌ను నింపింది.
దిశ, తెలంగాణ బ్యూరో : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్‌లో మహానగర వాసుల్లో మరింత సంక్రాంతి జోష్‌ను నింపింది. ఫెస్టివల్ ఇవాళ సాయంత్రం ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఫెస్టివల్ నిర్వాహకులు కళా బృందాలతో సాధారంగా స్వాగతం పలికారు. అనంతరం గగనంలో దేశ విదేశాలకు చెందిన పతంగులు ఎగిరాయి. కళాకారులతో కలిసి డప్పుకొట్టిన మంత్రులు పతంగులను ఎగురవేస్తూ మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక శాఖను దేశంలోనే అగ్ర స్థానంలో నిలుపుతామని అన్నారు. అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, ఇందులో 400 రకాల అంతర్జాతీయ స్వీట్ స్టాళ్లు, 50 హ్యాండ్లూమ్ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటిసారి కైట్ ఫెస్టివల్ జరుగుతున్నందున, మహా నగర వాసులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి స్వీట్లు తింటూ కైట్లు ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. 16 దేశాలకు చెందిన కైట్స్ ప్లెయర్స్ ఫెస్టివల్‌కు హాజరైనట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రిగా, రవాణా మంత్రిగా టూరిజం అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఫెస్టివల్‌లోని స్వీట్లను రుచి చూసి అనంతరం మంత్రులు టూరిజం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, టూరిజం డైరెక్టర్ నిఖిల, సాట్స్ డైరెక్టర్ లక్ష్మి, డైరెక్టర్ ఆఫ్ కల్చర్ మామిడి హరికృష్ణ, తదితరులు హాజరయ్యారు. ఈ నెల 15న పరేడ్ గ్రౌండ్స్‌లో నగరవాసలు ఎక్కువ మంది పతంగులను ఎగురవేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు.