Tirumala News:‘తిరుపతి ఘటనలో కుట్ర కోణం పై దర్యాప్తు’.. హోంమంత్రి అనిత
తిరుమల(Tirumala) శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం రాత్రి తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు.
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం రాత్రి తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. కాగా ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను తిరుపతి రుయా ఆస్పత్రిలో హోం మంత్రి అనిత నేడు(గురువారం) పరామర్శించారు. ఈ క్రమంలో చనిపోయిన వారిని తలచుకుని విలపించిన బాధిత కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. తమ్ముడి భార్యను పోగొట్టుకున్నానంటూ తమ్ముడికి ఏం సమాధానం చెప్పాలని ఏడుస్తున్న మహిళను చూసి హోం మంత్రి అనిత చలించి పోయారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఒక ప్రాణం కాపాడబోయి ఎక్కువ రద్దీ వల్ల ఆరుగురు మృతి చెందడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. సున్నితమైన ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా సహకరించాలని కోరారు.
చనిపోయిన వారిలో విశాఖ(Visakhapatnam) జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఇటువంటి కష్టం కలగడం చాలా బాధాకరం. తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తాం అన్నారు. బాధ్యతారహితంగా పని చేసినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. జరిగిన ఘటనపై బాధితులు, కలెక్టర్, ఎస్పీల ద్వారా తెలుసుకున్న హోంమంత్రి క్యూ లైన్ లో నిర్వహణ భక్తుల భద్రతను పెంచాం. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం(AP Government) బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబాలను హోంమంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి , జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు.
( Credit to Telugu Desam Party (TDP)- Official Facebook page)