AP News:‘వైసీపీ నిర్వాకం వల్లే విజయవాడకు వరద విపత్తు’.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల సమయంలోనూ వైసీపీ పార్టీ బురద రాజకీయం చేసిందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

Update: 2024-11-20 09:41 GMT

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడలో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల సమయంలోనూ వైసీపీ పార్టీ బురద రాజకీయం చేసిందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. అసలు వైసీపీ నిర్వాకం వల్లే విజయవాడకు వరద విపత్తు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. నేడు(బుధవారం) జరిగిన శాసనమండలిలో మండలి సభ్యులు విజయవాడ, బుడమేరు వరదలపై అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. 20 నిమిషాలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించని వాళ్లు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమా? అంటూ సూటిగా ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా విజయవాడలో వర్షపాతం 36 సెంటీమీటర్లు నమోదవడం, అంటే గతంలో లేనివిధంగా 800 రెట్లు పెరిగిందన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు.

ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి 294 సహాయ శిబిరాలు, 1715 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వరద బాధితులకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని ఆమె స్పష్టం చేశారు. పది రోజులకు కోటి పదిహేను లక్షల మందికి ఆహార ప్యాకెట్లతో సహా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, వాటర్ బాటిళ్ల వంటి అన్ని వస్తువులు బాధిత కుటుంబాలకు పంపిణీ చేశామన్నారు. ఆకస్మిక వరదలతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితిని గమనించి డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడం వంటి సహాయక కార్యక్రమాలతో యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ వరదల కారణంగా 24 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 12 వేల హెక్టార్ల మేర ఉద్యాన పంటలు, 90 వేల పశు సంపద, 672 మత్స్య పరిశ్రమకు సంబంధించిన యూనిట్లకు నష్టం వాటిల్లిందన్నారు. 98,662 గృహాలు వరద ధాటికి దెబ్బతిన్నాయన్నారు. 665 కి.మీ ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ కు సంబంధించిన రోడ్లు కూడా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు.

ఈ విపత్తు వల్ల 43 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. బాధిత కుటుంబాలకు రూ.2 కోట్ల పైన ఆర్థిక సాయమందించి ప్రభుత్వం ఆదుకున్నట్లు వెల్లడించారు. 11 రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్ కార్యాలయాన్ని తన కార్యాలయంగా చేసుకుని రాత్రి పగలు తేడాలేకుడా శ్రమించిన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ప్రజలు 20 రోజుల జల దిగ్బంధంలో ఉంటే కనీసం 20 నిమిషాలు కూడా ప్రజల కోసం కేటాయించలేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వరద సాయంగా రూ.1,036 కోట్లు, విరాళాల కింద రూ.450 కోట్ల పైన వచ్చిందని హోంమంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వం వల్లే ఇంత భారీ విరాళాల సేకరణ సాధ్యమైందన్నారు. టీఆర్ 27 కింద, విజయవాడ వరదల కోసం రూ.139 కోట్లు విడుదల చేయగా..అందులో రూ.89 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. ఫైర్ సిబ్బంది సహకారంతో ఇళ్లను శుభ్రం చేయించడం, రుణాలు కట్టడంలో వెసులుబాటు, ఇంట్లో వరదల వల్ల పాడైన వస్తువులను బాగుచేయించడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఆమె వివరించారు. వైఎస్ జగన్ వరద బాధితులకోసం ప్రకటించిన రూ.కోటి సాయం జమైందో లేదో స్పష్టతలేదని హోం మంత్రి పేర్కొన్నారు.

Tags:    

Similar News