AP News:పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత

శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

Update: 2024-10-14 15:20 GMT

దిశ ప్రతినిధి, విజయనగరం: శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ఘటాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం హోంమంత్రి పైడితల్లి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న కంట్రోల్ రూమ్ సందర్శించారు. సిరిమానోత్సవం సందర్భంగా చేసిన పద్ధతి ఏర్పాట్లను సమీక్షించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు పైడితల్లి అమ్మవారి జాతర శుభాకాంక్షలు తెలిపారు. పండగలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారని అన్నారు. గత సంవత్సరం కన్నా, ఈ ఏడాది భక్తులు సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. సిరిమానోత్సవాన్ని మధ్యాహ్నం 3 గంటలకే ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం తనకు అలవాటుగా మారిందని చెప్పారు.

గత సంవత్సరం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు తనను ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఇప్పుడు ప్రోటోకాల్‌తో అమ్మవారిని దర్శించికొనే అవకాశాన్ని అమ్మవారు కల్పించారని అన్నారు. ఎన్డియే ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని పైడిమాంబాను కోరుకున్నానని మంత్రి తెలిపారు. హోమ్ మంత్రితో పాటు ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్, సీఎఫ్ఓ త్రినాధ రావు తదితరులు ఉన్నారు.


Similar News