గాలివీడు ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్... ఎస్పీకి కీలక ఆదేశాలు
గాలివీడు ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు..
దిశ, వెబ్ డెస్క్: చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా అన్నమయ్య జిల్లా వైసీపీ నాయకుల పరిస్థితి ఉంది. ప్రభుత్వం మారినా గతంలోలా దాడులకు తెగబడుతున్నారు. అధికారులు, సామాన్యులపై దౌర్జన్యాలు, దాడులకు దిగుతూ అహంకారానికి, ఆధిపత్య ధోరణిని పదర్శిస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్ఆర్ సీపీ నేతలు దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఆయనపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించి, జవహర్ బాబు గొంతుపైనే కాలేసి తొక్కి, నానా దుర్భాషలాడి పిడిగుద్దులతో విచక్షణరహితంగా దారుణంగా ప్రవర్తించారు. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిస్తోంది.
దీంతో గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును హోంమంత్రి అనిత ఫోన్ చేసి పరామర్శించారు. అండగా ఉంటుందని, భద్రత ఏర్పాట్లు చేస్తామని భరోసానిచ్చారు. ఘటనను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి చేయడం సహేతుకమైన చర్యకాదని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు పాల్పడిన వారిపై అవసరమైతే రౌడీ షీట్ తెరవడానికీ వెనకాడబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
మరోవైపు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఫోన్ చేసి ఎంపీడీవోపై దాడి ఘటనకు సంబంధించిన తాజా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే దాడికి పాల్పడిన వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రికి జిల్లా ఎస్పీ వివరించారు. మొత్తం 20 మంది వైసీపీ నాయకులు దాడిలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు.