AP Rains:రాష్ట్రంలో భారీ వర్షాలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచన
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల పై సీఎం చంద్రబాబు నేడు(బుధవారం) సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో మంగళవారం నుంచి నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల పై అధికారులతో సీఎం సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం.. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఇక భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అధికారులు కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.