AP News: ఆ సామాజికవర్గం ఓట్లు తొలగించాలంటూ సీఈవోకు వైసీపీ ఫిర్యాదు
తెలంగాణలో ఎన్నికల ముగిశాయి. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు...
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికల ముగిశాయి. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ఓటర్లకు డబుల్ ఎంట్రీలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓటు వేసిన వారు మళ్లీ ఏపీలో కూడా ఓట్ల హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని వైసీపీ అనుమానిస్తోంది. దీంతో ఆ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు వైసీపీ మంత్రులు జోగి రమేశ్, వేణు గోపాల్ బృందం బుధవారం ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. డబుల్ ఎంట్రీలు ఉన్న ఓట్లను గుర్తించి, వెంటనే తొలగించాలని ఫిర్యాదు చేశారు. ఏపీకి చెందిన లక్షా 30 వేల మందికి హైదరాబాద్‌లో ఓట్లు ఉన్నాయని, వారికి రాష్ట్రంలో కూడా ఓట్లు ఉన్నాయని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. మరీ ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన వారికి హైదరాబాద్‌లో ఓట్లు ఉన్నాయని, ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయని వాటిని తొలగించాలని కోరారు. తెలంగాణలో ఓటేసిన వారిని ఏపీలో ఓటేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేదే తమ విధానమని చెప్పారు. వెంటనే డూప్లికేట్ ఓట్లను తొలగించాలని సీఈవోకు వైసీపీ మంత్రులు విజ్ఞప్తి చేశారు.
కాగా ఏపీలో భారీగా దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయి. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దొంగ ఓట్ల నమోదుపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏపీకి చెందిన ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.