నేను డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధం: మేరుగు నాగార్జున
తన వద్ద రూ. 90 లక్షలు తీసుకుని మోసం చేశారని మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: తన వద్ద రూ. 90 లక్షలు తీసుకుని మోసం చేశారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున(Former Minister Merugu Nagarjuna)పై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. అంతేకాదు తనను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మేరుగు నాగార్జున స్పందించారు. తనపై కుట్ర, పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమన్నారు. తాను నిత్యం ప్రజల్లో ఉండే మనిషినని చెప్పారు. ఆమె ఎవరో తనకు తెలియదన్నారు. రాజకీయాల్లో గ్రౌండ్ లెవల్ నుంచి పైకి వచ్చానని పేర్కొన్నారు. ఆమెతో తనకు సంబంధం ఉంటే ఆధారాలు చూపించాలని మేరుగు నాగార్జున సవాల్ విసిరారు. వైసీపీలో తాను యాక్టివ్‌గా ఉండటం వల్ల తనపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. మహిళ చేసిన ఫిర్యాదుపై పూర్తి దర్యాప్తు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారెవరో తెలియాలన్నారు. ఎలాంటి విచారణ, టెస్టులు, చర్యలకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. రాజకీయాల్లో కోపం ఉంటే చంపేయండని చెప్పారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని, తన తప్పు ఉంటే ఉరిశిక్షకైనా సిద్దమని నాగార్జున స్పష్టం చేశారు.