Breaking: సీఎం జగన్ ఎదుట కేశినేని కీలక డిమాండ్లు..!

టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు...

Update: 2024-01-10 11:16 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి‌తో ఇవాళ ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం జగన్ ఎదుట కేశినేని నాని కీలక డిమాండ్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో తను ప్రతిపాదించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే సీట్లు, తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ వెస్ట్ స్థానంలో తన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ పెడతానని సీఎం జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. 

అయితే  భేటీ వివరాలను మాత్రం కేశినేని నాని బయటకు చెప్పలేదు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా చంద్రబాబుపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. 2013 నుంచి టీడీపీ కోసం ఆయన కష్టపడి పని చేసినట్లు తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తాను తీవ్రంగా కృషి చేశానని చెప్పారు. తన సొంత వ్యాపార సంస్థల కంటే కూడా పార్టీనే ముఖ్యమనుకున్నానని కేశినేని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం డబ్బు, సమయం వృధా చేసుకోవద్దని చాలా మంది తనకు చెప్పారని, కానీ ఓ లక్ష్యంతో  ఆ పార్టీలో పని చేశానని కేశినేని నాని తెలిపారు.

Tags:    

Similar News